Imran Khan: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేందుకు ఇస్లామాబాద్‌ వెళ్తున్నట్లు పీఎంఎల్‌-ఎన్ పార్టీ నాయ‌కురాలు మరియం నవాజ్‌ తెలిపారు. ఇప్ప‌టికే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలగించబడిందని పేర్కొన్నారు.  

PM Imran Khan govt: దాయాది దేశ‌మైన పాకిస్థాన్ లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. మ‌రోసారి ఆ దేశంలో రాజ‌కీయ అస్థిర‌త.. సంక్షోభం దిశ‌గా అడుగులు ప‌డుతున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్.. విదేశాల నుంచి అక్ర‌మ మార్గంలో పెద్ద ఎత్తున విరాళాలు పొందుతున్నార‌నే ఆరోప‌ణ‌లు తీవ్ర‌రూపం దాలుస్తూ.. ప్ర‌భుత్వం ప‌డిపోయే స్థాయికి చేరాయి. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో పాటు సొంత పార్టీ నాయ‌కులు సైతం ఇమ్రాన్ ఖాన్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు. ఆయ‌న‌ను ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో పాటు అరెస్టు చేసే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని అక్క‌డి రాజ‌కీయ నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇస్లామాబాద్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా బ‌య‌లుదేరాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్‌-ఎన్ పార్టీ) నాయ‌కురాలు మరియం నవాజ్‌నేతృత్వంలోని మార్చ్ శనివారం లాహోర్ నుండి ప్రారంభమైంది. ఇస్లామాబాద్ దిశ‌గా భారీ ర్యాలీగా ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, నేత‌లు వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా పీఎంఎల్‌-ఎన్ పార్టీ నాయ‌కురాలు మరియం నవాజ్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే తొలగించబడిందని అన్నారు. ప్రతిపక్షం ప్ర‌ధాన మంత్రికి వీడ్కోలు చెప్పడానికి ఇస్లామాబాద్‌కు వెళుతుంద‌ని చెప్పారు. "ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పోయింది.. అతను ప్రతిరోజూ అరుస్తున్నాడు. మేము వారికి వీడ్కోలు చెప్పబోతున్నాము" అని మరియం న‌వాజ్ స్థానిక మీడియాతో అన్నారు. "అసమర్థ ప్రభుత్వం.. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది... దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు" అని తెలిపారు. 

"ప్రభుత్వానికి వీడ్కోలు ప‌ల‌క‌డం మాత్రమే మిగిలి ఉంది. అతను (ఇమ్రాన్ ఖాన్) వేడుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఏమీ జరగదు" అని పిఎంఎల్-ఎన్ నాయ‌కురాలు మరియం నవాజ్ అన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ను గద్దె దింపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యేలే కార‌ణం తప్ప ప్రతిపక్షం కాదని ఆమె అన్నారు. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ సమావేశం మార్చి 28న జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మొత్తం సభ్యుల బలం 342.. మెజారిటీ మార్కు 172. PTI నేతృత్వంలోని సంకీర్ణం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTIకి 155 మంది సభ్యులు ఉన్నారు. దానిని నాలుగు ప్రధాన మిత్రపక్షాలు ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ ( MQM-P), పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్వైడ్ (PML-Q), బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP) మరియు గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ (GDA) మ‌ద్ద‌తుతో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 

నాలుగు మిత్రపక్షాలలో మూడు ఇమ్రాన్ ఖాన్ చ‌ర్య‌లను వ్య‌తిరేకిస్తున్నాయి. MQM-P, PML-Q, BAP పార్టీలు ఇప్ప‌టికే ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతును ప్రకటించి, తదనుగుణంగా ఓటు వేస్తామని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి మ‌రింత దారుణంగా మారి.. ప్ర‌భుత్వం ప‌డిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్రతిపక్ష శిబిరంలో మిత్రపక్షాలు చేరుతుండ‌టంతో.. ఆయా పార్టీల సీనియ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందేకు ముందుకు సాగుతున్నారు. అలాగే, వారి రిజర్వేషన్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేందుకు పార్టీ సీనియ‌ర్ నేత‌ల బృందాన్ని పంపారు. కాగా, దాదాపు 20 మంది సొంత పార్టీ నేత‌లు సైతం ఇమ్రాన్ ఖాన్ కు వ్య‌తిరేకంగా ముందుకు సాగుతూ.. స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. ఈ లిస్టులో మ‌రింత మంది చేరే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.