Coronavirus: కరోనాతో 59.09 లక్షల మంది మృతి !
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా ప్రభావం కోనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 59 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 426,470,427 మందిని అనారోగ్యానికి గురి చేసింది కోవిడ్-19.
Coronavirus: ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా, భారత్, బ్రెజిల్, పల యూరప్ దేశాల్లో గత నెలన్నర రోజుల నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉంది. అయితే, ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కేసులు, మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో కంటే ఒమిక్రాన్ ఉధృతి సమయంలోనే కరోనా మరణాలు, కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రభావం క్రమంగా మళ్లీ పెరుగుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కారణంగా ఇప్పటివరకు 5,909,534 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 42.6 కోట్ల మంది దీని బారినపడ్డారు. ఇటీవల కరోనా వైరస్ పంజా విసిరిన దేశాల్లో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు చెందిన సబ్ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సబ్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్నదని చెబుతున్నారు. కరోనా వైరస్ గణాంకాలను నమోదుచేసే వరల్డో మీటర్ కోవిడ్-19 డాష్‌బోర్డు వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 426,470,427 మంది కరోనా బారినపడ్డారు. కోవిడ్-19తో పోరాడుతూ 5,909,534 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 353,637,928 మంది కోలుకున్నారు. అయితే, కోలుకున్న వారు సైతం మళ్లీ కరోనా బారినపడటం, పలువురిలో కోవిడ్ లక్షణలు అలాగే కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, రష్యా, జర్మనీ, టర్కీ, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, ఇరాన్ లు టాప్ లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు సగం టాప్-5లో ఉన్న దేశాల్లోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 80,145,282 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే, 960,157 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రెండో దేశం భారత్. ఇక్కడ ఇప్పటివరకు మొత్తం 4,28,51,929 కోవిడ్-19 కేసులు, 5,12,344 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో కోవిడ్-19 కారణంగా ఎక్కువగా ప్రభావితమైన మూడో దేశం బ్రెజిల్. ఇప్పటికీ అక్కడ కరోనా ప్రభావం అధికంగానే ఉంది. బ్రెజిల్ ఇప్పటివరకు మొత్తం 28,250,591 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా మహమ్మారితో పోరాడుతూ 644,695 మంది చనిపోయారు. ఇక ఫ్రాన్స్ లో 22,304,024 మందికి కరోనా సోకగా, 132,662 మంది మరణించారు. బ్రిటన్ లోనూ కరోనా మరణాలు అధికంగా సంభవించాయి. బ్రిటన్ లో ఇప్పటివరకు మొత్తం 18,654,572 కేసులు, 160,610 మరణాలు నమోదయ్యాయి. రష్యాలోనూ కరోనాతో 346,235 మంది చనిపోయారు.