Asianet News TeluguAsianet News Telugu

‘ఈ కోడితో పడలేకపోతున్నాం బాబూ.. మమ్మల్ని కాపాడండి’.. కోడిపుంజుమీద కోర్టులో కేసు...

పొరుగింటి కోడికూసి ఇబ్బంది పెడుతోందని.. దాంతో పడలేకపోతున్నాం అంటూ ఓ వృద్ధ జంట కోర్టు మెట్లెక్కారు. ఈ ఘటన జర్మనీలో జరిగింది.

German Couple Has Sued Their Neighbours Rooster
Author
Hyderabad, First Published Aug 23, 2022, 9:08 AM IST

జర్మనీ : ఇరుగుపొరుగు అన్న తర్వాత  కొన్ని సమస్యలు మామూలే.   ఊళ్లో అయితే కోళ్ల పంచాయతీలు మామూలుగా కనిపిస్తుంటాయి. అవి ఎవరికి కొత్తగా అనిపించవు.  కాసేపు వాదులాడుకుని, తిట్టుకుని ఊరుకుంటారు. కానీ, ఇక్కడ ఓ జంట ఆశ్చర్యకరమైన పని చేసింది. ‘పక్కింటి వాళ్ళ కోడి వేధిస్తోంది, భరించలేకుండా ఉన్నాం బాబోయ్’  అంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా చేసింది జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా. కోడిపుంజు తెగ కూస్తూ ఇబ్బంది పెడుతోందని.. కోర్టుకు విన్నవించుకున్నారు. కోడి అన్న తర్వాత  కూయకుండా ఉంటుందా? ఆ మాత్రానికే కేసు పెట్టాలా? అతికాకపోతే..  అని విన్నవాళ్ళు ముక్కున వేలేసుకున్నారు.  

అయితే,  ఒకటి, రెండు సార్లు మామూలే. కొన్ని 10, 20 సార్లు కూస్తాయి.. కానీ ఈ కోడి.. రోజుకు రెండు వందల సార్లు కూస్తుందట. అది కూడా 80 డెసిబెల్స్  రేంజ్ లో  కూస్తుందట. అంటే, విపరీతమైన రద్దీగా ఉన్న ఒక వీధిలో వచ్చే శబ్దం అంతా అన్నమాట. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ కూతల మోత… సాయంత్రం వరకూ.. అంటే మిగతా కోళ్లతోపాటు గూట్లోకి చేరేంత వరకు ఉంటుందట. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ గోల భరించలేక వారు కోడిపై కేసు పెట్టారు. 

‘పొరుగు వాళ్ళు కోడిని వదులుకోలేరు. అది ఉంటే మేము ప్రశాంతంగా నిద్ర కూడా పోలేక పోతున్నాం. తలుపులు, కిటికీలు తీస్తే నాన్ స్టాప్ చప్పుడు… చివరికి గార్డెన్కు వెళ్లాలన్నా వెళ్ళలేక పోతున్నాము.  అదో, మేమో తేల్చుకోవాల్సిందే’ అని అంటున్నారు. పొద్దున లేస్తే కోడి చేసే చప్పుడు రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతే కాదు… దాని దెబ్బకు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయినవారి గురించి కూడా కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఆయన తీర్పు మీదే ఈ కోడి భవిష్యత్తు ఆధారపడి ఉందన్న మాట. 

‘కోడి పుంజు పోయింది.. వెతికి పెట్టండి ప్లీజ్’.. ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారిన చోరీ..

ఇదిలా ఉండగా, ఇలాంటి న్యూసెన్స్ కేసే ఒకటి చిలుకమీద పెట్టారు. మహారాష్ట్ర పూణెలో ఈ ఘటన ఆగస్ట్ 8న వెలుగు చూసింది. పొరుగింట్లో పెంచుకుంటున్న ఓ చిలక వల్ల తనకు తెగ ఇబ్బంది కలుగుతోందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరుపులు, కీచులాటతో తనకు నిద్రలేకుండా చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర పూణేలో శివాజీ నగర్ ప్రాంతంలో నివసించే అక్బర్ అజ్మెర్ ఖాన్ ఇంట్లో ఓ చిలకను పెంచుకుంటున్నాడు.

అయితే, దాని కీచులాట పొరుగింట్లో ఉండే సురేష్ శిందే (72)ను తెగ ఇబ్బంది పెట్టిందట. దాని చిలక గోలకు సరిగా నిద్ర పట్టడం లేదని, ప్రశాంతత లేకుండా పోతోందని అతడు తాజాగా ఖడ్కీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై ఖడ్కీ పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించారు. చిలుక ద్వారా ప్రశాంతతకు భంగం కలుగుతుందని ఓ ఫిర్యాదు అందింది. నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios