Asianet News TeluguAsianet News Telugu

‘కోడి పుంజు పోయింది.. వెతికి పెట్టండి ప్లీజ్’.. ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారిన చోరీ..

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్రమైన కేసు నమోదయ్యింది. తన కోడిపుంజు చోరీకి గురయ్యందని.. వెతికి పెట్టాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 

missing complaint of pet cock in andhra pradesh
Author
Hyderabad, First Published Jun 2, 2022, 12:51 PM IST

అన్నమయ్య జిల్లా : ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు తలలు పట్టుకునేలా చేసింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీ అయ్యిందంటూ.. లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు. 

మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది వెతికి పెట్టండి...  మా ఇంట్లో పిల్లి కనిపించడం లేదు. మా ఇంట్లో నెక్లెస్ పోయింది.. ఫలానా వారి మీద అనుమానం ఉంది..  అంటూ పోలీసులకు కంప్లైంట్ రావడం మామూలే. అసలే రాజకీయంగా ఎవరిమీద కేసులు పెట్టాలి.. అధికార పార్టీ నేతల నుంచి వచ్చే కంప్టైంట్స్ ఎలా పరిష్కరించాలి.. అనేది పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రోజులివి. దానికితోడు ఇతర నేర వార్తలు వారిని నిలవనీయకుండా చేస్తుంటాయి.  బంగారం, నగదు దోచుకెళ్లారు అని తరచూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం పరిపాటి.. అయితే దానికి భిన్నంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అదేదో సినిమాలో పెన్సిల్ పోయింది.. అని ఓ కుర్రాడు కంప్లైంట్ ఇస్తాడు.. అచ్చం అలాంటిదే ఓ విచిత్రమైన కంప్లైంట్ పోలీసులకు  అందింది. తన తెల్ల కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ విచిత్రమైన కంప్లైంట్ చూసిన పోలీసులకు తలనొప్పి వచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు వెంకటాద్రి. అల్లారుముద్దుగా పెంచుకున్నజాతి కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం పోలీస్ స్టేషన్ లో అరుదైన ఫిర్యాదు చేశాడు వెంకటాద్రి. గత నెల 29వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. 

అయితే, ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటే.. ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసులు తెగ ఇదై పోతున్నారు. వాల్మీకీపురం మండలం, తాగిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి.. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం, సేలం నుంచి జాతి పుంజులు తెచ్చుకుని పెంచుతున్నాడు. అందులో ఒక్కగానొక్క పుంజు మాత్రమే బతకడంతో ఆ పుంజును ఎంతో ఇష్టంగా పెంచి పోషిస్తున్నాడు. మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9వేల విలువగల జాతి కోడిపుంజును ఎత్తుకెళ్లారు. 

ఎంతో మురిపెంగా పెంచుకున్న జాతి కోడి పుంజులు దొంగిలించారని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాపోయాడు. గ్రామ పరిసరాల్లో కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు ఎత్తుకెళ్లారు అనిఅనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని ఫిర్యాదు చేయడం గమనార్హం. నా కోడిపుంజు నాకు తెచ్చి ఇవ్వాలని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులను వేడుకుంటున్నాడు.  వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై బిందుమాధవి మీడియాకు తెలిపారు. మీకు ఆ కోడిపుంజు కనిపిస్తే పోలీసులకు చెప్పమంటూ చెబుతున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios