హమాస్‌పై భూతల దాడికి సిద్ధమవుతోన్న ఇజ్రాయెల్ .. గాజా ప్రజల కోసం సేఫ్ కారిడార్, 3 గంటలు నో అటాక్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు భూతల దాడులకు కూడా ఇజ్రాయెల్ సిద్ధమవుతూ వుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్ధితులు తలెత్తుతాయోనని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తమ భూభాగంలోకి చొచ్చుకురావడమే కాకుండా సాధారణ పౌరులను దారుణంగా చంపిన హమాస్‌ను ఈ భూమ్మీద లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ భీకరదాడులు చేస్తోంది. మరోవైపు భూతల దాడులకు కూడా ఇజ్రాయెల్ సిద్ధమవుతూ వుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్ధితులు తలెత్తుతాయోనని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలో సాధారణ ప్రజలు బలికాకుండా, ప్రాణనష్టం తగ్గించేందుకు గాను ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో సేఫ్ కారిడార్‌ను తెరిచింది. తద్వారా ప్రజలు సముద్ర తీర భూభాగంలోని సురక్షితమైన దక్షిణ భాగానికి వీలు కలుగుతుంది. ఈ మేరకు ఎక్స్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ట్వీట్ చేసింది. ఈ కారిడార్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలాంటి ఆపరేషన్ జరగదని స్పష్టం చేసింది.
గాజా సిటీ, ఉత్తర గాజాలకు చెందిన ప్రజల భద్రత కోసం దక్షిణ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా ఐడీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మార్గంలో ఎలాంటి దాడులు జరగవని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపు వెళ్లే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. గాజా ప్రజలు, వారి కుటుంబాల భద్రత తమకు ముఖ్యమని ఐడీఎఫ్ పేర్కొంది. తమ సూచనల మేరకు దక్షిణం వైపు వెళ్లాలని సూచించింది.
ఇవాళ తెల్లవారుజామున దక్షిణ గాజాకు వెళ్లకుండా హమాస్ ప్రజలను నిలిపివేసిన ఫోటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. వీరిని హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తుందని తెలిసిన ప్రదేశాల్లో హమాస్ ఉద్దేశపూర్వకంగా బందీలను వుంచుతోందని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మీడియాకు తెలిపారు. ఐడీఎఫ్ వైమానిక దాడుల్లో గాజాలో మరో 9 మంది ఇజ్రాయెల్ బందీలు మరణించారని హమాస్ చేసిన ప్రకటనకు స్పందనగా ఇయల్ హులాటా ఈ వ్యాఖ్యలు చేశారు.