కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని ఆలస్యం చేయగలం కానీ... ఈ వైరస్ ని పూర్తి స్థాయిలో నిర్మూలించలేమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

ఇక ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ఏ దేశం దగ్గర కూడా మందులు కానీ వాక్సిన్ కానీ లేవు. అందరూ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ నుంచి మొదలు హెచ్ఐవి మందుల వరకు ఇలా అనేక రకాల మందులను ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వాడుతున్నారు. 

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలందరు కూడా ఈ సమయంలో ఈ మహమ్మారికి మందు కనుక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే పొగాకు మొక్క నుండి ఈ కరోనా మహమ్మారికి వాక్సిన్ తాయారు చేసేందుకు ప్రయోగాలను ప్రారంభించారు. 

తాజాగా ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సిగరెట్ పనిచేస్తుందా అనే కోణంలో పరిశోధనను ఆరంభించారు. సిగరెట్ లో ఉండే నికోటిన్ పై ఈ ప్రయోగాలను ప్రారంభించారు. 

ఫ్రెంచ్ శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ నికోటిన్ కరోనా వైరస్ సోకకుండా కాపాడడంలో సఫలీకృతం అవుతుందని తెలిపారు. ఈ విషయమై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలను ప్రారంభించేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు పూనుకుంటున్నారు. 

సిగరెట్ లో ఉండే నికోటిన్ శరీరంలోకి కరోనా వైరస్ ని రానీయకుండా నది మండలంపై పనిచేస్తోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చైనాలో కూడా ఇలా సిగరెట్లు తాగేవారిలో చాలా తక్కువమంది ఈ కరోనా వైరస్ బారినపడ్డట్టు తేలిందన్నారు. 

ప్రభుత్వ అనుమతుల కోసం ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. అనుమతులు గనుక వస్తే.. మెడికల్ సిబ్బందికి నికోటిన్ ప్యాచులను చేతులకు అంటించి వారికి ఆ ప్యాచ్ లోని నికోటిన్ కరోనా సోకకుండా నిరోధిస్తుందా లేదా అని పరిశోధన జరపనున్నారు.