ఇమ్రాన్ సర్కార్ పై ప్రజలు విరక్తి చెందినట్లు తెలుస్తోంది. పాక్ ప్రభుత్వంపై ప్రజలు సర్వే చేయగా.. 77శాతం ప్రజలు విరక్తి చెందినట్లు చెప్పడం గమనార్హం. ఇమ్రాన్ ప్రభుత్వం గాడి తప్పిందని.. తప్పుదోవలో వెళుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు పాక్ ప్రభుత్వం పై ఇదే వైఖరితో ఉన్నారని ఆ సర్వేలో తేలింది. కేవలం 23 శాతం మంది ప్రజలు మాత్రమే పాకిస్తాన్ సరైన దిశలో పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. 

ఐపీఎస్‌ఓఎస్ సంస్థ డిసెంబర్ 1 నుంచి 6 తేదీ వరకూ ఈ సర్వేను నిర్వహించింది. దాదాపు వెయ్యి మందికి పైగా వారి అభిప్రాయాలను సేకరించింది.  ఇక... దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని 36 మంద అభిప్రాయపడితే, 13 మంది బాగా ఉందని తెలిపారు. ఇక... 51 మంది తటస్థంగా ఆర్థిక వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.

పాక్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితి ఆర్థికంగా పేలవంగానే ఉందని ఆ సర్వే సూచించింది. నిరుద్యోగిత పెద్ద సమస్యగా పరిణమించిందని ‘సింధ్’’ లోని 20 శాతం మంది అభిప్రాయపడగా, ఖైబర్ ఫఖ్తుక్వాన్‌లో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 18 శాతం మంది నిరుద్యోగిత సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక బెలుచిస్తాన్ లో నిరుద్యోగిత పెద్ద సమస్య అని 25 శాతం మంది ప్రజలు పెదవి విరవగా, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని 25 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.