Asianet News TeluguAsianet News Telugu

spaceX: మూడు రోజులు రోదసిలో పర్యటించి సురక్షితంగా పుడమి చేరుకున్న యాత్రికులు

మూడు రోజుల పాట అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన నలుగురు సాధారణ పౌరులు ఈ రోజు ఉదయం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ పంపిన క్యాప్సుల్స్‌లో భూమికి సుమారు 575 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని రోజుకు 15 సార్లు భూమిచుట్టూ భ్రమించారు. సుశిక్షుతలైన వ్యోమగాములు లేకుండా కేవలం సాధారణ పౌరులే అంతరిక్ష యాత్రకు వెళ్లడం ఇదే తొలిసారి.
 

four civilians landed safely on earth after three days of space tour
Author
Washington D.C., First Published Sep 19, 2021, 2:30 PM IST

న్యూఢిల్లీ: రోదసి ప్రయోగాల్లో మరో అధ్యాయం తెరుచుకుంది. సులభ అంతరిక్ష పర్యటనకు మార్గం సుగమమైంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్’ స్పేస్‌షిప్‌లో రోదసిలోకి వెళ్లిన నలుగురు సాధారణ పౌరులు మూడు రోజులపాటు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి ఈ రోజు ఉదయం సురక్షితంగా భూమిని చేరింది. ఫ్లోరిడా తీరాన అట్లాంటిక్ మహాసముద్రంలో ప్యారాచుట్‌ సహాయంతో సుక్షితంగా నీటిలో వారి క్యాప్సుల్ ల్యాండ్ అయింది. వెంటనే సిబ్బంది వారిని నౌకలోకి తీసుకున్నారు. దీంతో రోదసిలో మూడు రోజులు గడిపిన నలుగురు పౌరులు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. సమర్థులైన వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరుల బృందమే అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే ప్రథమం.

 

స్పేస్ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్ బుధవారం వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. భూమి నుంచి సుమారు 575 కిలోమీటర్ల ఎత్తుకు వీరిని తీసుకెళ్లింది. భూ కక్ష్యలోకి చేరగానే క్యాప్సుల్‌కు ఉన్న కిటికీ తెరుచుకోవడంతో ప్రయాణికులు అంతరిక్ష అద్భుతాలను పరికించారు. అక్కడికి చేరుకున్నాక వీరు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ రోజుకు 15 సార్లు భూమి చుట్టూ తిరిగింది. మూడు రోజులపాటు తిరిగి మళ్లీ భూమిపైకి తిరిగి వచ్చింది.

వ్యోమగాములు కాకుండా సాధారణ పౌరులకే ఆరు నెలల శిక్షణ ఇచ్చి ఈ ప్రయోగంలో అంతరిక్షానికి పంపారు. క్రూ డ్రాగన్ స్పేస్‌షిప్‌లోని కంప్యూటర్‌లను భూమి పైనుంచి పర్యవేక్షించారు. ఈ ప్రయాణంలో ప్రయాణికుల బయోలజికల్ డేటాను పొందుపరిచారు. సాధారణంగా స్పేస్ఎక్స్‌కు చెందిన ఈ స్పేస్‌షిప్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా(ఐఎస్ఎస్)నికి వ్యోమగాములను తీసుకెళ్తుంటుంది. కానీ, తాజా ప్రయోగంలో ఐఎస్ఎస్‌ కంటే కనీసం 150 కిలోమీర్లు ఎత్తుకు వెళ్లారు. ‘ఇన్‌స్పిరేషన్4’ పేరిట సాగిన ఈ యాత్ర సక్సెస్‌ఫుల్ కావడంతో సాధారణ పౌరులనూ యాత్రకు ప్రోత్సహించినట్టయింది. ఇప్పటికే వర్జిన్ చీఫ్ రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌లు తమ సంస్థలు చేసిన ప్రయోగాల్లో భాగంగా అంతరిక్ష యాత్రకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్రల్లో సుశిక్షితులైన నిపుణులు వారివెంట వెళ్లారు. కానీ, స్పేస్ఎక్స్ యత్ర అందుకు భిన్నంగా సాధారణ పౌరులనే యాత్రకు పంపింది.

Follow Us:
Download App:
  • android
  • ios