ట్రంప్​ సొంత సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకుంటారని గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై పలు సందర్భాల్లో ట్రంప్ సంకేతాలు కూడా ఇచ్చారు. 

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలకు పోటీగా తన సొంత సోషల్ నెట్‌వర్కింగ్ ప్రారంభించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు అంత సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా తన సొంత నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌కు సంబంధించిన ప్రణాళికలను ట్రంప్ బుధవారం వెల్లడించారు. వచ్చేనెలలో ఆహ్వానించిన గెస్ట్‌ల కోసం బీటా వెర్షన్‌లో ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో TRUTH Social ప్లాట్‌ఫామ్‌ కొనసాగనుంది. TMTGని పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మార్చడానికి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్ప్‌తో (Digital Acquisition Corp) విలీనం అవుతుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి యాప్ మాత్రం వచ్చే ఏడాది‌లో యూఎస్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

టెక్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడటానికి తాను ట్రూత్ సోషల్, TMTG ని సృష్టించాను అని ట్రంప్ అన్నారు. ‘ట్విట్టర్​లో తాలిబన్ల సంఖ్య చాలా ఎక్కువే. కానీ మీ అభిమాన అధ్యక్షుడికి మాత్రం అందులో చోటు లేదు. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ట్రూత్​ సోషల్​ ద్వారా నిజాయతీగల సందేశాలను పంచుకునేందుకు నేను ఎదురుచూస్తున్నా’అని Donald Trump పేర్కొన్నారు. 

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కాలంలోనే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి పలు సందర్బాల్లో ఆయనకు షాక్ ఇచ్చాయి. పలు సందర్భాల్లో సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన పోస్టులు తొలగించబడ్డాయి. ఇక, ఈ ఏడాది జనవరిలో వాషింగ్టన్‌లో అమెరికా చట్టసభ భవనం క్యాపిటల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు, సానుభూతిపరులు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన అకౌంట్స్‌ను ప్రముఖ సోషల్ నెట్‌వర్క్‌లు నిషేధించాయి. ఆ తర్వాత ట్రంప్ తన సొంత సోషల్ నెట్‌వర్క్ ఏర్పాటు ద‌ృష్టి సారించినట్టుగా వార్తలు వచ్చాయి. 

ట్రంప్​ సొంత సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకుంటారని గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై పలు సందర్భాల్లో ట్రంప్ సంకేతాలు కూడా ఇచ్చారు. ఏడాది మే నెలలో ట్రంప్ "ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డోనాల్డ్ జె. ట్రంప్" అనే బ్లాగ్‌ను ప్రారంభించారు. అయితే అది ట్రంప్ నుంచి వచ్చిన కొత్త అవుట్ లెట్‌గా పలువురు భావించారు. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ మాత్రం ట్రంప్ నంచి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తాను ట్రూత్ సోషల్ పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించారు.

డోనాల్డ్ ట్రంప్ సహాయకుడు జాసన్ మిల్లర్ ఈ ఏడాది ప్రారంభంలో గెట్టర్ అనే సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అయితే ట్రంప్ మాత్రం దానిలో చేరలేదు.