అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఓబామా క్వారంటైన్ సమయంలో తన కూతురు బాయ్ ఫ్రెండ్ తమతోనే ఉన్నాడని చెప్పి షాక్ కి గురిచేశాడు. బరాక్ ఒబామా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెద్ద కుమార్తె మాలియా ఒబామా బ్రిటిష్  బాయ్ ఫ్రెండ్ లాక్డౌన్ సమయంలో ఉన్నాడని చెప్పి ఆశ్చర్యపరిచాడు. 

ది బిల్ సిమన్స్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో లాక్డౌన్ సమయంలో మీ కిష్టమైన విషయం ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని పంచుకున్నారు ఒబామా. ఇంకా మాట్లాడుతూ అందరిలాగే మేమూ మొదటి నెల రోజులు ఆటలు, హ్యాండీ క్రాఫ్ట్, ఫుడ్ అంటూ సరదాగా గడిపేశాం. ఆ తరువాత మాలియా, సాషా బోర్ ఫీలవ్వడం మొదలెట్టారు. మాలియా, సాషాలకు చదువునేర్పించడం కూడా ఈ విసుగుకి కారణం కావచ్చంటూ చెప్పుకొచ్చారు. 

ఈ టైంలో మాలియా బాయ్ ఫ్రెండ్ బిట్ కొద్దిరోజులు మాతోనే గడిపాడు అని షాక్ కి గురి చేశాడు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ అతను బ్రిటిషర్, అద్బుతమైన యువకుడు, అతడు ఉద్యోగం చేస్తున్నాడు. వీసా సమస్యలతో అతనిక్కడ ఇరుక్కుపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని మాతో ఉంచుకోవాల్సి వచ్చింది. అతన్ని ఇష్టపడాలని నేను అనుకోలేదు. కాకపోతే అతను మంచి పిల్లవాడు అంటూ చెప్పుకొచ్చాడు. 

అతని తిండి విషయం నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. బాగా తినేసేవాడు.. అతను ఉన్నన్ని రోజులు నా కిరాణా బిల్లు 30 శాతం పెరిగింది అది విచిత్రంగా అనిపించింది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. 

ఒబామా ప్రస్తుతం తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామాకు వివాహం జరిగి 28 సంవత్సరాలు, ఈ దంపతులకు మాలియా (22), సాషా (19) ఇద్దరు కుమార్తెలున్న సంగతి తెలిసిందే.