సారాంశం

ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో పాకిస్థాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు ఫవాద్ చౌదరీ ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో టెన్షన్ పడుతూ కోర్టులోకి పరిగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్ సమాచార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ తనను పోలీసులు మళ్లీ ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో కోర్టు లోపలికి పరిగెత్తాడు. ఆయాసంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

`గత వారం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన ఫవాద్ చౌదరి, తన పార్టీ మద్దతు దారులతో కలిసి హింసాత్మక నిరసనలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ రెగ్యులేషన్ కింద పోలీసులు నిర్బందించారు. అయితే దీనిని సవాల్ చేస్తూ అతడు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్ సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. తాను నిర్దోషిని అని వాదనలు వినిపించారు. 

ఇకపై తాను ఎలాంటి హింసాత్మక నిరసనల్లో పాల్గొనబోనని, ప్రేరేపించబోనని హామీ ఇవ్వడంతో ఆయనను విడుదల చేయాలని ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన వేచి ఉండలేదు. ఫవాద్ చౌదరి వెంటనే తన తెల్లని ఎస్ యూవీలో ఎక్కాడు. కొంచెం ముందుకు కదలగానే పోలీసులు వాహనాలు తనను సమీపిస్తున్నాయని గ్రహించాడు.

ఆ సమయంలో సంప్రదాయ సల్వార్-కమీజ్ ధరించిన ఉన్న మాజీ మంత్రి.. పోలీసులు తను మళ్లీ అరెస్టు చేస్తారనే భయంతో డోర్ ఓపెన్ చేసి కోర్టు భవనం లోపలికి పరిగెత్తడం ప్రారంభించారు. ఈ పరిణామం అతడి న్యాయవాదులను, అక్కడే ఉన్న అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురి చేసింది. లోపలికి వచ్చిన తరువాత ఫవాద్ కు సహాయం చేయడానికి ఓ న్యాయవాది వచ్చాడు. పలువురు వ్యక్తులు ఆయనను ‘కంగారు పడకండి’ అంటూ సూచించారు. మరి కొందరు ‘నీళ్లు తీసుకురండి’ అని చెబుతున్నారు. 

ఈ పరిణామానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లోపలికి వెళ్లిన తరువాత ‘కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు ’ అని అంటూ జస్టిస్ ఔరంగజేబ్ కు చౌదరి తెలిపారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి చల్లటి మాట చెబుతూ ఓదార్చారు. ‘మీరే ప్రాక్టీషనర్ (లాయర్) కాబట్టి లిఖితపూర్వక ఉత్తర్వు కోసం వేచి చూడాల్సింది’ అని అన్నారు. చివరికి సాయంత్రం అదే న్యాయమూర్తి చౌదరిని ఏ కేసులోనూ అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయడంతో మాజీ మంత్రికి పెద్ద ఉపశమనం లభించింది. తరువాత ఆయన ఇంటికి బయలుదేరాడు.