Asianet News TeluguAsianet News Telugu

Omicron: యూకేలో రికార్డు కేసులు.. తొలిసారి లక్ష దాటి నమోదు

యూకేలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒకవైపు ఒమిక్రాన్ భయాలు నెలకొని ఉండగా ఈ దేశంలో మంగళవారం ఒక్క రోజే లక్షకు మించి కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ఇంగ్లాండ్‌లో ప్రవేశించినప్పటి నుంచి రోజువారీ కేసులు లక్ష దాటడం అక్కడ ఇదే తొలిసారి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించడానికి యూకే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై కాన్సంట్రటే యేస్తున్నది.
 

for the first time corona cases records above one lakh in england
Author
London, First Published Dec 22, 2021, 11:50 PM IST

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. మన దేశంలోనూ ఈ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ వెలుగులోకి రాగానే.. ఐరోపా దేశం యూకే వేగంగా ఆ దేశం నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది. అంత తొందర పనికి రాదన్నట్టుగా దక్షిణాఫ్రికా అధికారులు అన్నారు. వాటిని ఖాతరు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంది యూకే. అయినప్పటికీ ఈ దేశంలో కేసుల కట్టడి సాధ్యం కాలేదనే చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్నప్పుడే ఈ దేశంలో రోజువారీగా కరోనా కేసుల(Corona Cases) నమోదు లక్ష దాటలేదు. కానీ, ఇప్పుడు ఆ దేశంలో ఈ రికార్డును తిరగరాశాయి. యూకేలో గడిచిన 24 గంటల్లో మొత్తం కేసులు 106,122 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఐరోపాలో కరోనాతో అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో యూకే ముందు వరుసలో ఉన్నది. కరోనా మహమ్మారి ఈ దేశంలో ప్రవేశించినప్పటి నుంచి యూకేలో మరణాలు 147,573కు చేరాయి. 1.1 కోట్ల పాజిటివ్ కేసులు యూకేలో నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ ఈ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంగ్లాండ్‌లో గతేడాది మే, జూన్‌‌లలో మాస్ టెస్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అత్యధిక కేసులు 93,045 కేసులుగా ఉన్నాయి. కానీ, ఈ రికార్డును మంగళవారం నాటి కేసుల నమోదు బద్ధలు చేసింది. గడిచిన 24 గంటల్లో 106,122 కొత్త కేసులు నమోదైనట్టు బుధవారం ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నాటికి ఈ దేశంలో కరోనాతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వారి సంఖ్య 8,008గా ఉన్నది. నవంబర్ 22 తర్వాత అత్యధికంగా హాస్పిటల్ అడ్మిషన్లు కావడం ఇదే తొలిసారి. గత వారంతో పోల్చితే ఈ సంఖ్య 4శాతం పెరిగింది.

Also Read: యూపీ ఎన్నికలకు ఒమిక్రాన్ ముప్పు? కరోనా కట్టడి చర్యల వివరాలు అడిగిన ఈసీ

అయితే, ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ మరణాలు మాత్రం అంత భయపడేలా లేవని వైద్య అధికారులు వెల్లడించారు. గడిచిన వారం రోజుల వివరాలు చూస్తే కొత్త కేసుల సంఖ్య 58.9 శాతం పెరిగింది. కాగా, ఇదే సమయంలో కరోనా మరణాల సంఖ్య 2.7 శాతం తగ్గడం గమనార్హం. ఒమిక్రాన్ ప్రభావాన్ని కరోనా టీకాల ద్వారా తగ్గించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే మూడో డోసు అందించడంపై ఫోకస్ పెట్టింది. మంగళవారం రికార్డు స్థాయిలో ఈ టీకాల పంపిణీ జరిగింది. మంగళవారం ఒక్క రోజే 968,665 మందికి మూడో డోసు వేశారు. గత వారం మూడో డోసు వేసుకున్నవారి సంఖ్య 6.1 మిలియన్ కాగా, మూడో డోసు తీసుకున్న మొత్తం మంది సంఖ్య 3.08 కోట్లకు పెరిగింది. ఈ నెల చివరికల్లా వయోజనులు అందరికీ మూడో డోసు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాగా, పిల్లలకూ టీకా వేయడంపై ఆలోచనలు చేస్తున్నది. ఇప్పటికే ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం లోయర్ డోస ఫార్ములేషన్ ఆధారిత ఫైజర్ టీకాను ఎంహెచ్‌ఆర్ఏ ఆమోదించింది. ఇది చిన్న పిల్లల్లో ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు ఫలితాలు వచ్చాయని, ఆ తర్వాత దీన్ని ఆమోదించినట్టు ప్రభుత్వం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios