ప్రపంచంలో కెల్లా ఎత్తైన శిఖరం... ఎవరెస్ట్. ఈ పర్వాతాన్ని అదిరోహింది ఎంతో మంది రికార్డు సాధించారు. ఎవరెస్టుని ఎవరైనా అధిరోహించిన ప్రతిసారి వార్తల్లోకి ఎక్కేది. తొలిసారిగా... ఎవరెస్ట్ పర్వతం... చెత్త, వ్యర్థపదార్థాల కారణంగా వార్లల్లో నిలిచింది.

రోజు రోజుకీ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య పెరుగుతుండటంతో...  పర్వతంపై చెత్త కూడా పెరిగిపోతోందని నేపాల్ సైన్యం ఆరోపిస్తోంది. దేశ, విదేశాల నుంచి పర్వతారోహకులు తరలివస్తుండటంతో ఈ మంచుకొండలపై చెత్తాచెదారం పేరుకుపోయింది. చెత్త పేరుకుపోవడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందనే భయంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగి వాలంటీర్ల సాయంతో చెత్తను తరలించే పనులు చేపట్టింది.

 ఏప్రిల్ 14 నుంచి మే 8వతేదీ వరకు ఎవరెస్టు శిఖరంపై పేరుకుపోయిన 5టన్నుల చెత్త, చెదారాన్ని హెలికాప్టరు ద్వార తరలించామని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టరు జనరల్ దండు రాజ్ ఘిమిరే చెప్పారు. నేపాల్ పర్యాటక శాఖ చెత్త తొలగించే పనిని బ్లూ వేస్ట్ వాల్యూ కంపెనీకి అప్పగించింది. 

ఎవరెస్టు శిఖరంపై ఆక్సిజన్ సిలిండర్లు, టిన్ క్యాన్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలున్నాయి. ఎవరెస్టు శిఖరంపై చెత్త పేరుకోకుండా నివారించేందుకు వీలుగా ప్రతీ పర్వతారోహకుడు 8కిలోల చెత్తను కిందకు తిరిగి తీసుకురావాలని నేపాల్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.