బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తన రాజీనామా ప్రకటించారు. ఆయనను వెంటనే దిగిపోవాలని మంత్రులు ఎందుకు రాజీనామాల బాట పట్టారు. ఆయనను దెబ్బతీసిన ప్రధానమైన కారణాలు ఏమిటి? బోరిస్‌పై పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకతను తెచ్చిన ఐదు కుంభకోణాల గురించి చర్చిద్దాం. 

న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ కొంత సేపటి క్రితమే రాజీనామాను ప్రకటించారు. మంత్రులు, కన్జర్వేటివ్ పార్టీ చట్టసభ్యులు రాజీనామాలు చేసి ఆయనను ఒంటరి చేశారు. ప్రధాని పదవికి ఆయన తగడు అని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 50కిపైగా రాజీనామాలు వచ్చాయి. తొలుత తాను తిరస్కరించినా.. చివరకు రాజీనామాను ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేసినా.. చివరకు దిగిపోక తప్పని పరిస్థితి వచ్చింది. అక్టోబర్‌లో కొత్త పీఎంను నియమించే వరకు ఆయన ఆపద్ధర్మ పీఎంగా కొనసాగుతారు. రాజీనామా చేసిన మంత్రులు కూడా అప్పటి వరకు కొనసాగనున్నారు. అయితే, మంత్రులు, చట్టసభ్యులు ఎందుకు రాజీనామాలు చేశారు. బోరిస్ జాన్సన్‌ దిగిపోవాలని ఎందుకు డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కొన్ని కుంభకోణాలు ఉన్నాయి. ఆ స్కాండల్స్.. బోరిస్ జాన్సన్ రాజకీయ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. ఆయన పదవికే ఎసరు పెట్టాయి. అలాంటి ఐదు ప్రధాన కుంభకోణాలు చూద్దాం..

1. క్రిస్ పించర్‌ వ్యవహారం

ప్రధానంగా చెబితే.. ఒక సెక్స్ కుంభకోణం కారణంగా బ్రిటన్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది బోరిస్ జాన్సన్‌కు సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ క్రిస్ పించర్‌కు సంబంధించినది. క్రిస్ పించర్‌పై లైంగతిక ఆరోపణలు వచ్చాయి.. కానీ, వాటిపై సకాలంలో చర్యలు తీసుకోవడం పీఎం విఫలం అయ్యాడనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఉన్నది. 

క్రిస్ పించర్ ఓ ప్రైవేట్ క్లబ్‌లో ఇద్దరు పురుషులను లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు వచ్చాయి. దీంతో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌కు రాజీనామా చేశారు. కానీ, ఆయనను బ్రిటన్ పార్లమెంటులో పార్టీ డిప్యూటీ హెడ్‌గా బోరిస్ నియమించడం తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. పించర్‌పై ఆరోపణలు వచ్చినట్టు తనకు తెలియదని ముందుగా బుకాయించి ఆ తర్వాత తనకు అధికారికంగా ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకోక తప్పు చేశానని చెప్పుకొచ్చారు.

2. పార్టీగేట్

కరోనా లాక్‌డౌన్ కాలంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండగా ప్రధాని బోరిస్ జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో పార్టీలు జరుపుకున్నట్టు కథనాలు వచ్చాయి. స్టాఫ్ చాలా మంది పార్టీలో పాల్గొన్నారని, పలుమార్లు పార్టీలు జరిగినట్టు మీడియా బట్టబయలు చేసింది. తప్పతాగి.. వోమిటింగ్ చేసుకున్న సందర్భాలూ ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆ సమావేశాలు చట్టాన్ని అతిక్రమించేలా పరిణమిస్తాయని భావించలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తప్పును అంగీకరించారు.

3. ఇతర సెక్స్ కుంభకోణాలు

ఇతర కన్జర్వేటివ్ పార్టీ చట్టసభ్యులపైనా లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెండు కేసులు కీలకంగా ఉన్నాయి. ఒకటి చట్టసభ్యుడు ఇమ్రాన్ అహ్మద్ కాన్ 15 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించడం.. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. హౌజ్ ఆఫ్ కామన్స్‌(అంటే యూకే పార్లమెంటులో)లో రెండు మార్లు ఫోన్‌లో పోర్న్ చూసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను ఆయన అంగీకరించి రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. మరో చట్టసభ్యుడు కూడా లైంగిక ఆరోపణల కేసులతోనే అరెస్టు అయి బెయిల్‌పై విడుదల అయ్యారు.

4. ఓవెన్ ప్యాటర్సన్ లాబీ

ఓవెన్ ప్యాటర్సన్ కంపెనీల నుంచి సొమ్ము పుచ్చుకుని ఆ కంపెనీల గురించి ప్రభుత్వం ముందు గొప్పగా చెప్పి లాబీయింగ్‌కు పాల్పడ్డాడు. ఈ లాబీయింగ్‌పై మీడియాలో సంచలన వార్తలు వచ్చాయి. పార్లమెంంట్ స్టాండర్డ్స్ కమిటీ ఆయనపై 30 రోజుల సస్పెన్షన్ విధించాలని సిఫారసు చేసింది. కానీ, మీడియా కథనాల దృష్ట్యా ప్యాటర్సన్ రాజీనామా చేశారు. ఆయన సీటుకు జరిగిన ఎన్నికలోనూ పార్టీ ఓడిపోయింది.

5. పీఎం ఫ్లాట్ పునర్నిర్మాణం

డౌనింగ్ స్ట్రీట్‌లోని పీఎం ఫ్లాట్‌ను పునర్నిర్మించే పనులను ప్రముఖ డిజైనర్‌కు అప్పగించారు. అందులో గోల్డ్ వాల్‌పేపర్‌కు కూడా ప్లాన్ చేశారు. ఇందుకోసం విరాళాలు వచ్చాయి. కానీ, ఆ విరాళాలను పారదర్శకంగా రిపోర్ట్ చేయలేదని బ్రిటన్ ఎలక్టోరల్ కమిషన్ కన్జర్వేటివ్‌లకు 17,800 పౌండ్ల జరిమానా వేసింది. డోనర్లతో పీఎం జాన్సన్ మెసేజీల గురించి తనకు చెప్పలేదని జాన్సన్ ఎథిక్ అడ్వజైర్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత జాన్సన్ ఉద్దేశపూర్వకంగా ఏమీ దాచలేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపైనా పీఎం జాన్సన్‌పై పార్టీ నేతలతోపాటు ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపించింది.