దీపావళి వేడుకల్లో విషాదం.. లండన్‌లో భారత సంతతి కుటుంబంలోకి ఐదుగురు అగ్నికి ఆహుతి..
దీపావళి పండగ వేళ పశ్చిమ లండన్‌లో నివాసం ఉంటున్న ఓ భారత సంతతి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దీపావళి పండగ వేళ పశ్చిమ లండన్‌లో నివాసం ఉంటున్న ఓ భారత సంతతి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారి ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితుల వివరాలను పోలీసులు ఇంకా పేర్కొననప్పటికీ.. స్థానిక నివేదికలు ప్రకారం వారు భారత సంతతికి చెందినవారని తెలిపాయి. ఆదివారం రాత్రి దీపావళి జరుపుకుంటున్న సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నాయి.
అయితే ఈ ఘటనలో మృతి చెందిన ఆరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదంలో గాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు. ‘‘ఈ విషాద సంఘటనలో చాలా విచారంగా ప్రాణాలు కోల్పోయిన వారి ప్రియమైనవారితో నా ఆలోచనలు ఉన్నాయి’’ అని మెట్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ సీన్ విల్సన్ అన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. విచారణ ప్రారంభ దశలోనే ఉందని.. తాము ఓపెన్ మైండ్‌తో విచారణ జరపాల్సి ఉందని చెప్పారు.
ఇక, ఈ అగ్నిప్రమాదంపై ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం 22:30 గంటలకు తమను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అనేక మంది లండన్ ఫైర్ బ్రిగేడ్ అగ్నిమాపక సిబ్బంది, లండన్ అంబులెన్స్ సర్వీస్ (ఎల్‌ఏఎస్) అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న నివాసాలను ఖాళీ చేయించామని.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ప్రారంభ దశలో ఎవరినీ అరెస్టు చేయలేదని మెట్ పోలీసులు తెలిపారు.
మరోవైపు మాంచెస్టర్‌కు చెందిన దిలీప్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన బావ, అతని భార్య, ముగ్గురు పిల్లలు, మరో ఇద్దరు వ్యక్తులు ఇంటివద్ద ఉన్నారని చెప్పారు. ఇక, బాధిత కుటుంబం ఇటీవలే బెల్జియం నుంచి లండన్‌లోని ఇంటికి మారినట్లు సమాచారం.