కరోనా కొత్త రకం రోజుకో దేశానికి పాకుతోంది. తాజాగా ఫ్రాన్స్ కు పాకింది. శుక్రవారం అక్కడ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. బాధితుడు డిసెంబర్ 19న బ్రిటన్ నుంచి తిరిగొచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 21న పరీక్షలు జరపగా. పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ లో ఉంచారు. తదుపరి పరీక్షలు చేయగా.. అది కొత్త రకం వైరస్ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. 

దీంతో అప్పమత్తమైన అధికారులు ఇటీవల బాధితుడు కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. బ్రిటన్ లో వైరస్ వెలుగులోకి రాగానే అప్పమత్తమైన ఫ్రాన్స్ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. కానీ, స్వదేశం వారు తిరిగొచ్చేందుకు వీలుగా కొంత వెసులుబాటు కల్పించింది. అలాగే సరకుల రవాణాకు సైతం పచ్చజెండా ఊపింది. కానీ కరోనా నిర్థారణ పరీక్షలను తప్పనిసరి చేసింది. 

దక్షిణాఫ్రికాలో జన్యుమార్పిడికి లోనైన ఈ కొత్త వైరస్ అక్కడి నుంచి ఓ ప్రయాణికుడి ద్వారా బ్రిటన్ కు చేరింది. అక్కడ భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్పమత్తమైంది. దేశవ్యాప్తంగా మళ్లీ నిషేదాజ్ఞలు విధించింది. దీంతో అప్పమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇక ఇటలీలోనూ ఓ వ్యక్తిలో ఈ వైరస్ ను గుర్తించారు. డెన్మార్క్ లోనూ ఏడుగురికి కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యిందని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. అలాగే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలోనూ ఒక్కో కేసు నమోదైంది.