జర్మనీ నుంచి సింగపూర్‌లో సుమారు 3 వేల కార్లతో వెళ్లుతున్న భారీ నౌక నెదర్లాండ్స్ సమీపంలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక నావికుడు మరణించాడు. మిగితా సిబ్బంది సముద్రంలో దూకి తమ ప్రాణాలు రక్షించుకున్నాడు. అయితే, మరణించిన ఆ నావికుడు భారతీయుడేనని నెదర్లాండ్స్‌లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. 

న్యూఢిల్లీ: యూరప్ కంట్రీ నెదర్లాండ్స్ సముద్ర తీరంలో ఓ భారీ నౌక ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 2,857 కార్లను జర్మనీ నుంచి సింగపూర్‌కు తీసుకెళ్లుతున్న రవాణా నౌక బుధవారం మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏకైక వ్యక్తి భారతీయుడేనని గుర్తించారు. ఈ విషయాన్ని నెదర్లాండ్స్ దేశంలోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. 

భారత ఎంబసీ తన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నౌకలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. మరికొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయి. మరణించిన భారతీయుడి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ నావికుడి డెడ్ బాడీని స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తున్నాం. క్షతగాత్రులతోనూ నిత్యం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రస్తుతం వారి ప్రాణాలకు ముప్పేమీ లేదు. వారంతా సురక్షితమే. నెదర్లాండ్స్ అధికారులు, షిప్పింగ్ కంపెనీ కోఆపరేషన్‌తో చర్యలు తీసుకుంటున్నాం’ అని నెదర్లాండ్స్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది.

మృతి చెందిన ఆ భారత నావికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. అలాగే.. గాయపడిన వారిలో ఎవరైనా భారతీయులు ఉన్నారా అనే విషయం కూడా ఇంకా తెలియరావాల్సి ఉన్నది.

Also Read: అధికారం కోసం వాళ్లు మణిపూర్‌నే కాదు.. దేశం మొత్తాన్నీ తగులబెడతారు: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లపై రాహుల్ గాంధీ ఫైర్

జర్మనీ నుంచి సింగపూర్‌కు వెళ్లుతున్న ఆ నౌకలో 25 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయని, అందులో ఒక ఎలక్ట్రానిక్ కారులో మంటలు రాజుకున్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ షిప్‌లో ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. కట్టడి చేయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ, మరికొన్ని రోజులు ఈ మంటలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ భారీ నౌక ఒక వేళ మునిగిపోతే మాత్రం సముద్రంలో పెద్ద మొత్తంలో ఇంధనం, ఇతర కాలుష్యాలు కలిసిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ముప్పును తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.