బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ దాడులు.. 13 గంటల పాటు సోదాలు.. మరిన్ని రహస్య పత్రాలు స్వాధీనం..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరింతగా సమస్యల్లో కూరుకుపోతున్నారు. తాజాగా విల్మింగ్టన్‌లోని బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరింతగా సమస్యల్లో కూరుకుపోతున్నారు. తాజాగా విల్మింగ్టన్‌లోని బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టారు. 13 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు అక్కడ మరిన్ని రహస్య పత్రాలను కనుగొన్నారు. సోదాల సమయంలో న్యాయ శాఖ తన విచారణ పరిధిలోని వస్తువులను స్వాధీనం చేసుకుందని జో బైడెన్ వ్యక్తిగత న్యాయవాది బాబ్ బాయర్ తెలిపారు. వీటిలో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్న సమయంలోనివి, మరికొన్ని ఆయన ఉపాధ్యక్షుడినిగా ఉన్నకాలానికి చెందినవని చెప్పారు. బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సంవత్సరాలలో వ్యక్తిగతంగా చేతితో రాసిన నోట్స్‌ను కూడా తదుపరి సమీక్ష కోసం న్యాయశాఖ తీసుకుందని చెప్పారు.
ఇక, న్యాయశాఖ ప్రామాణిక విధానాలకు అనుగుణంగా శోధనను ముందుగానే పబ్లిక్ చేయవద్దని అభ్యర్థించిందని.. తాము సహకరించడానికి అంగీకరించామని చెప్పారు. ఇక, బైడెన్ నివాసాలు, ప్రైవేట్ కార్యాలయాల్లో లభించిన మొత్తం రహస్య పత్రాల సంఖ్య ఇప్పుడు దాదాపు 18 వరకు పెరిగింది. 2009 నుంచి 2016 వరకు బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నకాలానికి చెందినవాటితో సహా అన్ని పత్రాలను ఎఫ్‌బీఐ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. అధ్యక్షుడి ప్రత్యేక న్యాయవాది రిచర్డ్ సౌబెర్ మాట్లాడుతూ.. బైడెన్ తన వ్యక్తిగత న్యాయవాదులను న్యాయ శాఖ కొనసాగుతున్న విచారణలో భాగంగా పూర్తిగా సహకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. సెర్చ్ సమయంలో అధ్యక్షుడు గానీ, ప్రథమ మహిళ గానీ ఆ నివాసంలో లేరని చెప్పారు. ప్రెసిడెంట్ లాయర్లు, వైట్ హౌస్ కౌన్సెల్ కార్యాలయం ఈ ప్రక్రియ వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించబడేందుకు న్యాయశాఖ, స్పెషల్ కౌన్సెల్‌తో సహకరిస్తూనే ఉంటాయని సౌబర్ చెప్పారు.
ఇక, ఇటీవల బైడెన్‌కు చెందిన ప్రదేశాల్లో రహస్య పత్రాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే గత వారం యూఎస్ అటార్నీ జనరల్ మెరిక్ బీ గార్లాండ్ అధ్యక్షుడి ప్రైవేట్ కార్యాలయాలు, నివాసంలో రహస్య పత్రాలకు సంబంధించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ హర్‌ను నియమించారు.