రెండేళ్ల పాప మాస్క్ పెట్టుకోలేదని పాపతోపాటు.. ఆమె తల్లిదండ్రులను సైతం విమానంలో నుంచి దింపేశారు. ఈ సంఘటన  అమెరికాలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమాన సిబ్బంది.. చిన్నారితోపాటు.. తల్లిదండ్రులను కూడా దింపేశారు. ఈ ఘటనకు సంబంధించి పాప తల్లి ఎలిజ్ ఆర్బన్ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ‘మా పాప ఫేస్‌మాస్క్ సరిగ్గా ధరించలేదని మమ్మల్ని విమానం నుంచి అన్యాయంగా కిందకు దించేశారు. అంతేకాకుండా జీవితాంతం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయకూడదని మాపై నిషేధం విధించారు’ అంటూ వీడియోలో ఎలిజ్ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. 

వీరిని విమానం నుంచి దించేముందు అసలు ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను గమనిస్తే.. పసిపాప తండ్రి ఫేస్‌మాస్క్ పెట్టాలని ప్రయత్నిస్తున్నా పాప మాత్రం మాస్క్ పెట్టుకోనంటూ మారం చేసింది. అనంతరం సిబ్బందిలో ఒకరు అక్కడకు వచ్చి వెంటనే కిందకు దిగాల్సిందిగా పాప తండ్రికి చెప్పారు. పాప తండ్రి ఎంత చెప్పినా సిబ్బంది వినిపించుకోకపోవడంతో చివరకు పాపను తీసుకుని తల్లిదండ్రులిద్దరూ విమానం దిగిపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు.