Asianet News TeluguAsianet News Telugu

రష్యా ప్రభుత్వానికి 2.29 లక్షల డాలర్ల ఫైన్ చెల్లించిన ఫేస్‌బుక్.. ఎందుకంటే?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ 2.29 లక్షల అమెరికన్ డాలర్ల జరిమానాను రష్యా ప్రభుత్వానికి కట్టింది. రష్యా ప్రభుత్వం నిషేధించిన కంటెంట్‌ను ఫేస్‌బుక్ సంస్థ డిలీట్ చేయలేదు. పలుసార్లు హెచ్చరించినా ఆ కంటెంట్‌ను డిలీట్ చేయడంలో ఫేస్‌బుక్ సంస్థ విఫలం అయింది. ఈ కేసును మాస్కో కోర్టు విచారించింది.

facebook pay fine to russia over content
Author
Moscow, First Published Dec 19, 2021, 5:46 PM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్(Facebook).. రష్యా(Russia) ప్రభుత్వానికి 2,29,643 అమెరికన్ డాలర్ల జరిమానా కట్టింది. ఫేస్‌బుక్‌తోపాటు గూగుల్, టెలిగ్రామ్ యాప్‌లు కూడా రష్యా ప్రభుత్వానికి ఫైన్(Fine) కట్టినట్టు తెలిసింది. సాధారణంగా ప్రభుత్వాలు సోషల్ మీడియా(Social Media)లో ప్రచారమయ్యే ప్రభుత్వ వ్యతిరేక, విమర్శనాత్మక కంటెంట్‌పై అసహనం ఉంటూనే ఉంటుంది. ఎలాగైనా నియంత్రించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఇదే క్రమంలో రష్యాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశంలో నిషేధిత కంటెంట్‌ను పలుమార్లు హెచ్చరించినా డిలీట్ చేయడంలో ఫేస్‌బుక్ విఫలం అయిందనే కేసులో ఆ సంస్థకు జరిమానా పడింది. ఇటీవలే ఫేస్‌బుక్ సంస్థ 17 మిలియన్ రూబుల్స్ (అమెరికన్ డాలర్లు 2,29,643) ఫైన్ కట్టింది.

ఇంతటితో ఇది ఆగిపోయేలా లేదు. మరికొన్ని ఫైన్లు కట్టే అవకాశాలు ఎదురవుతున్నట్టు తెలుస్తున్నది. ఫేస్‌బుక్, గూగుల్ మాతృ సంస్థలు మెటా, ఆల్ఫాబెట్‌లు వచ్చే వారం ఓ కోర్టు కేసును ఎదుర్కోబోతున్నాయి. రష్యా చట్టాన్ని అతిక్రమించాయనే ఆరోపణలను అవి ఎదుర్కొంటున్నాయి. వీటిపై ఆ సంస్థలు రష్యాలో ఆర్జిస్తున్న రాబడిలో కొంత శాతం మేరకు ఫైన్ విధించే అవకాశం ఉన్నది. ఇలా సంస్థలపై జరిమానా కింద అవి యేటా ఆర్జించే ఆదాయంలో ఐదు శాతం నుంచి 10 శాతం వరకు వసూలు చేయడానికి రష్యా చట్టాలు అవకాశం ఇస్తున్నాయి.

Also Read: Social Media: ‘సోషల్ మీడియా అరాచకమే.. దాన్ని నిషేధించాలి’

ఫేస్‌బుక్‌పై 17 మిలియన్ రూబుళ్ల ఫైన్ పడింది. ఇందుకు గాను అక్టోబర్‌లో రష్యా ప్రభుత్వ న్యాయ అధికారులను ఆ సంస్థ దగ్గరకు పంపింది. అయితే, సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నది. రష్యా ప్రభుత్వ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రొస్కోమ్నాజర్ అమెరికా దిగ్గజ సంస్థలు గూగుల్, మెటాలపై కేసు ఫైల్ చేశారు. రష్యాలో ఆ సంస్థలు యేటా ఆర్జిస్తున్న రాబడుల్లో కొంత శాతం మేరకు జరిమానా పడే అవకాశం ఉన్నదని మాస్కో కోర్టు ఈ నెల 3వ తేదీన వెల్లడించింది.

ఇంటర్నెట్‌పై నియంత్రణ సాధించడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వ్యక్తిగత స్వేచ్ఛ, కార్పొరేట్ ఫ్రీడమ్‌ను హరిస్తుందని పేర్కొంటున్నారు.

టెలిగ్రామ్ యాప్ కూడా రష్యా ప్రభుత్వానికి ఫైన్ కట్టినట్టు ఇంటర్‌ఫ్యాక్స్ కథనం వెల్లడించింది. టెలిగ్రామ్ యాప్ 15 మిలియన్ రూబుళ్ల జరిమానా విధించిందని తెలిపింది. అయితే, ఈ ఫైన్‌పై అటు ఫేస్‌బుక్, ఇటు టెలిగ్రామ్ యాప్ స్పందించలేదు. గూగుల్ సంస్థ కూడా ఈ ఏడాదికి గాను 32 మిలియన్ రూబుళ్ల జరిమానా వెచ్చించినట్టు ఓ కథనం తెలిపింది.

Facebookలో ఏవైనా అభ్యంతరకర(Defematory) పోస్టులు, విద్వేషాలు సృష్టించే పోస్టులు పెడితే కేసులు నమోదవడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. వాట్సాప్ స్టేటస్‌లపైనా ఇటీవలే టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు గెలిచినప్పుడు కేసులు ఫైల్ కావడాన్ని చూశాం. అయితే, ఈ కేసులు పోస్టు చేసిన వ్యక్తులపై నమోదయ్యాయి. కానీ, Uttar Pradeshలో ఇందుకు అదనంగా ఏకంగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌(Mark Zuckerberg)పైనే FIR నమోదైంది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై అభ్యంతరకర పోస్టుకు సంబంధించిన ఘటనలో మార్క్ జుకర్‌బర్గ్‌పైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, ఈ పోస్టును మార్క్ జుకర్‌బర్గ్ చేయలేదు. కానీ, అభ్యంతరకర మెస్సేజ్ పోస్టు చేయడానికి ఫేస్‌బుక్‌ను ఎంచుకున్నారు కాబట్టే, ఆ  సంస్థ సీఈవోపైనా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ పేరును తొలగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios