అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డోనాల్డ్ ట్రంప్ మొదట్లో దాన్ని అంగీకరించక నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జో బైడెన్ అక్రమంగా ఎన్నికల్లో గెలుపొందారని చెప్పి న్యాయపోరాటం కూడా చేశారు. న్యాయస్థానాల్లో కూడా ట్రంప్ కు ఎదురు దెబ్బతగిలింది. దీంతో  అధికార మార్పిడి చేసే సమయం దగ్గర పడుతుండటంతో ట్రంప్ మెత్తపడ్డారు.  

అప్పటి వరకు కఠినంగా వ్యవహరించిన ట్రంప్, తనలోని కొత్తకోణాన్ని బయటపెట్టారు. థాంక్స్ గివింగ్ వేడుకలో ట్రంప్ రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టారు. ఆ తరువాత వరసగా అనేకమందికి ట్రంప్ క్షమాభిక్ష పెడుతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు.  ట్రంప్ కుటుంబసభ్యులు, రష్యన్ గెట్ అనుమానితులు, యుద్ధ నేరాలకు పాల్పడిన వారు ఇలా చాలామంది ఉన్నారు.  రెండు రోజుల్లోనే 41 మందికి క్షమాభిక్ష పెట్టారు.  

ఎవరికైనా సరే క్షమాభిక్ష పెట్టె అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. దానికి ఎవరూ అడ్డు చెప్పలేరు. ఆ అధికారం రాజ్యాంగం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చింది. ఎందుకు క్షమాభిక్ష పెడుతున్నారు అని అడిగే రైట్స్ ఎవరికి ఉండవు. అందుకే అధికారం కోల్పోయాక తన అనుకూల వర్గానికి ఇబ్బందులు ఉండకూడదని ట్రంప్ వరసగా క్షమాభిక్షలు పెట్టేస్తున్నారు. 

రాబోయే రోజుల్లో మరికొంత మందికి ట్రంప్ క్షమాభిక్షపెట్టే అవకాశం ఉన్నది. అయితే, ఇప్పుడు ట్రంప్ తన కుటుంబంతో పాటుగా తనను తాను క్షమించేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయంపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. అధికారం కోల్పోయాక తనపై ఎంక్వైరీ జరగకుండా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రంప్ ఈ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.