టర్కీ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండవ సారి కూడా రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్‌ విజయం సాధించారు. అధ్యక్షుడితో పాటు పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఈ ఆదివారం ఎన్నికలు జరిగాయి. తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపులోనే ఎర్డొగన్ విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటికి వరకూ 99 శాతం ఓట్లను లెక్కించగా ఎర్డొగన్ 53 శాతం ఓట్లు సాధించారని స్థానిక మీడియా పేర్కొంది.

టర్కీ ప్రెసిడెంట్ రేసులో ఎర్డొగన్‌తో తలపడిన సమీప ప్రత్యర్థి ముహర్రమ్ ఇన్స్‌కు 31 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఎర్డొగన్ మాట్లాడుతూ.. 'ఈ విజయంతో.. ప్రజాస్వామ్యం విషయంలో టర్కీ ప్రపంచానికీ ఓ పాఠం నేర్పింద'ని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైనా మొత్తం 50 శాతానికి మించి ఓట్లు లభిస్తే విజయం సాధించినట్లే, రెండోసారి ఓటింగ్ నిర్వహించాల్సిన అసరం ఉండదు.

గత  2016 జూలైలో జరిగిన సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత టర్కీలో ఎమర్జెన్సీ విధించారు. నిజానికి ఈ ఎన్నికలు 2019 నవంబర్‌లో జరగాల్సి ఉండగా, వీటిని ఎర్డొగన్ ముందుకు జరిపారు. ఎర్డొగన్ 2014లో అధ్యక్ష పదవి చేపట్టక ముందు 11 సంవత్సరాల పాటు ప్రధాన మంత్రిగా పనిచేశారు.