Asianet News TeluguAsianet News Telugu

NATO: నాటోలో చేరుతామంటూ ఫిన్‌లాండ్, స్వీడ‌న్ ప్ర‌క‌ట‌న‌.. మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌న్న ట‌ర్కీ !

Finland, Sweden joining NATO: నాటో లో చేరాల‌నుకునే కొత్త దేశాల‌కు కూట‌మిలోని అన్ని దేశాల నుంచి మ‌ద్ద‌తు ఉండాలి. అయితే, ఫిన్‌లాండ్, స్వీడ‌న్ దేశాలు నాటో చేర‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని ట‌ర్కీ పేర్కొంది. కాగా, ట‌ర్కీ 1952లో NATOలో చేరింది.. అమెరికా తర్వాత 30 దేశాల కూట‌మిలో రెండవ అతిపెద్ద మిలిటరీని కలిగి ఉంది.
 

Erdogan says Turkey doesnt support Sweden, Finland joining NATO
Author
Hyderabad, First Published May 14, 2022, 4:50 AM IST

Turkey President Erdogan: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఫిన్‌లాండ్, స్వీడ‌న్ దేశాలు నాటో చేరుతామంటూ ప్ర‌క‌టించాయి. దీనిపై ఇప్ప‌టికే ర‌ష్యా నాటోలో చేర‌బోయే దేశాల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు దేశాలు కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే దశలో ఉన్న నేప‌థ్యంలో నాటో స‌భ్య‌దేశ‌మైన ట‌ర్కీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఫిన్‌లాండ్, స్వీడ‌న్ దేశాలు నాటో చేర‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని ట‌ర్కీ పేర్కొంది. నాటో లో చేరాల‌నుకునే కొత్త దేశాల‌కు కూట‌మిలోని అన్ని దేశాల నుంచి మ‌ద్ద‌తు ఉండాలి. ట‌ర్కీ 1952లో NATOలో చేరింది.. అమెరికా తర్వాత 30 దేశాల కూట‌మిలో రెండవ అతిపెద్ద మిలిటరీని కలిగి ఉంది. ఇప్పుడు ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డోగ‌న్ ఈ రెండు దేశాలు నాటో చేర‌డానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌క‌టించారు. అలాగే, ఆయా దేశాల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ఆ రెండు దేశాలు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నాయ‌ని ఆరోపించారు. టర్కీ తీవ్రవాద గ్రూపుగా వర్గీకరించే కుర్దిష్ వర్కర్స్ పార్టీ లేదా PKK సభ్యులకు నోర్డిక్ దేశాలు ఆతిథ్యం ఇవ్వడాన్ని ఎర్డోగాన్ ప్రస్తావించారు.

″మేము స్వీడన్ మరియు ఫిన్లాండ్‌కు సంబంధించిన పరిణామాలను అన్నింటినీ గ‌మ‌నిస్తున్నాము. ఆ రెండు దేశాలు నాటోలో చేరే విష‌యంపై మేము సానుకూల అభిప్రాయాలను కలిగి లేము” అని ఎర్డోగాన్ శుక్రవారం ఇస్తాంబుల్‌లో మీడియాతో అన్నారు. కాగా,  ఈ విషయంలో టర్కీ అధికారిక వైఖరిని స్పష్టం చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని సీనియర్ అమెరికన్ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. వారాంతంలో బెర్లిన్‌లో జరిగే నాటో మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్య చర్చించ‌నున్నారు. యూరప్ మరియు యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ శుక్రవారం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు.  కాగా,  నాటో కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. తద్వారా ఇతర పొరుగు దేశాలు నాటో వైపు చేరబోవనే ఆలోచన కూడా ఇందులో ఉన్నది. కానీ, రష్యా ఆలోచనలకు భిన్నమైన పరిణామాలు ఎదురు వస్తున్నాయి. తాజాగా, రష్యా పొరుగు దేశం ఫిన్లాండ్ కూడా నాటోలో చేరతామనే ప్రకటన చేసింది. నాటో కూటమి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రకటించారు. దీనికి కారణం రష్యానే అని, ‘మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి’ అంటూ రష్యాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్తో మండిపడ్డారు.

నాటో కూటమిలో చేరడంపై ఫిన్లాండ్ పార్లమెంటులో ఇంకా చర్చ జరగాల్సి ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ, ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఆ దేశం నాటో కూటమిలో చేరడానికి గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగానే అర్థం అవుతున్నది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఫిన్లాండ్ మాత్రమే కాదు.. స్వీడన్ కూడా ఇదే ఆలోచనల్లో ఉన్నది. ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి చేయడం ప్రారంభించగానే ఫిన్లాండ్, స్వీడన్ దేశ ప్రజల అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాటో కూటమిలో చేరడానికి అనుకూలమైనట్టు కథనాలు వచ్చాయి. రష్యా తమపైనా దాడి చేయడానికి వెనుకాడబోదని, కాబట్టి, నాటో కూటమి రక్షణ తీసుకోవడం ఉత్తమం అనే నిర్ణయాలకు ప్రజలు వస్తున్నట్టు వివరించాయి

Follow Us:
Download App:
  • android
  • ios