ట్విట్టర్ దాకలు చేసిన లా సూట్‌ను వాయిదా వేయించాలని ప్రయత్నించిన ఎలన్ మస్క్ టీం భంగపడింది. మస్క్ టీం ప్రయత్నాలను డెలావేర్ కోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్‌లో కేసు విచారణకు నిర్ణయం తీసుకుంది. 

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విట్టర్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుని వెనుకడుగు వేసిన ఎలన్ మస్క్‌పై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లా సూట్ దాఖలు చేసింది. ఈ లా సూట్ విచారణను వీలైనంత వరకు వాయిదా వేయాలని ఎలన్ మస్క్ భావించారు. కానీ, ఈ ప్రయత్నాలకు డెలవేర్ జడ్జీ అడ్డుకట్ట వేశారు. అక్టోబర్‌లో ఈ లాసూట్ విచారించడానికి నిర్ణయం తీసుకుంది.

ఈ లా సూట్ విచారణలో జాప్యం తిరిగి పూడ్చుకోలేని నష్టం చేకూర్చిపెడుతుందని డెలవర్ కోర్ట్ ఆఫ్ చాన్సరీ హెడ్ జడ్జీ కేథలీన్ సెయిండ్ జ్యూడీ మెక్ కోర్మిక్ తెలిపారు. ఎంత ఆలస్యం అవుతుందో ముప్పు అంతగా తీవ్రతరం అవుతుందని వివరించారు.

సెప్టెంబర్‌లోనే తమ లాసూట్ విచారించాలని ట్విట్టర్ కోరింది. కాగా, ఎలన్ మస్క్ టీం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. వచ్చే ఏడాది తొలి నెలల్లో ఈ విచారణ చేపట్టలాని, ఈ కేసు చాలా సంక్లిష్టమైనదని పేరర్కొంది. ఈ వాదనను జడ్జీ మెక్ కోర్మిక్ కొట్టివేశారు. సంక్లిష్టమైన పిటిషన్‌లను వేగంగా ప్రాసెస్ చేయగలిగే డెలావేర్ కోర్టు సామర్థ్యాలను ఎలన్ మస్క్ టీమ్ తక్కువ అంచనా వేస్తున్నదని తెలిపారు.

ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తానన్న హామీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్ ప్రయత్నిస్తున్నదనియ వివరించారు. ఈ ప్రక్రియ అంతా కూడా వీలైనంత తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నట్టు వివరించారు. లేదంటే ఇది తమ బిజినెస్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చే ముప్పు ఉన్నదని తెలిపారు. 

ప్రతి ట్విట్టర్ షేర్‌కు 54.20 అమెరికన్ డాలర్లు చెల్లిస్తానని ఎలన్ మస్క్ తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలని భావిస్తున్నారు. 

ట్విట్టర్ సంస్థ తమకు బాట్‌ల విషయంపై సరైన సమాచారం ఇవ్వలేదని, బాధ్యతగా వ్యవహరించకుండా టాప్ మేనేజర్లనూ తొలగించిందని ఎలన మస్క్ టీం వాదించింది.

ఎలన్ మస్క్ చేస్తున్నవన్ని కూడా ట్విట్టర్ సంస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని మైక్రోబ్లాగింగ్ సైట్ తరఫు న్యాయవాది వాదించారు. ట్విట్టర్ సంస్థను నష్టాల వైపు ప్రయాణించేలా ఆయన పనులు ఉన్నాయని న్యాయవాది అటార్నీ విలియం సావిట్ ఆరోపించారు. ఈ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి... ఎలన్ మస్క్, ట్విట్టర్ వివాదాన్ని అక్టోబర్‌లో విచారిస్తామని తెలిపారు.