కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక నాలో అసలైన లక్షణాలు కనిపించాయి..: ఎలాన్ మస్క్ సంచలనం
ప్రముఖ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు సంబంధించి సంచలన కామెంట్స్ చేశారు.
ప్రముఖ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు సంబంధించి సంచలన కామెంట్స్ చేశారు. కోవిడ్‌ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని.. మూడో షాట్ తనను దాదాపు ఆసుపత్రికి పంపిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ మేరకు మస్క్ తన నేతృత్వంలోని ఎక్స్(ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ల ప్రభావంపై వాల్ స్ట్రీట్ సిల్వర్ అనే అకౌంట్ షేర్ చేసిన వీడియోను మస్క్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు.
ఆ వీడియోలో.. కోవిడ్ వ్యాక్సిన్‌ల సమర్ధత క్షీణిస్తుందని పేర్కొనబడింది. 2021 చివరిలో వ్యాక్సిన్‌లు విడుదల చేసినప్పటి నుంచి వాటి క్షీణిస్తున్న సామర్థ్యాన్ని ఇందులో ప్రస్తావించారు. భద్రత లేదా సమర్థత ఆందోళనల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో కొన్ని షాట్‌ల వినియోగాన్ని నిలిపివేయడానికి కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయాలను కూడా ఆ వీడియోలో పేర్కొన్నారు.
అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ‘‘కొత్త జాతులు, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి కోల్పోవడం ఫలితంగా.. సమర్థత మారుతుందని నేను అనుకుంటున్నాను. ఇది 100 శాతం ప్రభావవంతంగా ఉందని ఎవరైనా ఎప్పుడైనా క్లెయిమ్ చేయడం మూర్ఖత్వం. ఏ వ్యాక్సిన్ 100 శాతం పూర్తి ప్రూఫ్ కాదు’’ అని అన్నారు.
ఇందుకు బదులిచ్చిన ఎలాన్ మస్క్.. ఏదైనా చేయాలంటే ప్రజలు తప్పనిసరిగా టీకా, మల్టిపుల్ బూస్టర్‌లను తప్పనిసరిగా తీసుకోవాలి అనే దారుణమైన డిమాండ్ గురించే తన ఆందోళన అని పేర్కొన్నారు. అది గందరగోళంగా ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు చెల్లదని చెప్పే వరకు.. స్పేస్ ఎక్స్, అనేక ఇతర కంపెనీలు టీకాలు వేయించుకునేందుకు నిరాకరించిన వారిని తొలగించవలసి వచ్చేదని చెప్పారు. సిబ్బందిపై వ్యాక్సిన్ విధివిధానాలను ప్రయివేట్ కంపెనీలు బలవంతంగా అమలు చేసే విధానాలను పాటించడం కంటే జైలుకు వెళ్లడమే మేలని ఆయన అన్నారు.
‘‘నా విషయానికొస్తే.. వ్యాక్సిన్ ముగిసేలోపు నాకు అసలు కోవిడ్ వచ్చింది (తేలికపాటి జలుబు లక్షణాలు). ప్రయాణం కోసం మూడు వ్యాక్సిన్ డోస్‌లు తీసుకోవలసి వచ్చింది. మూడవ షాట్ నన్ను దాదాపు ఆసుపత్రికి పంపింది. కోవిడ్ కాకుండా.. వ్యాక్సిన్ లేదా కోవిడ్ చికిత్స నుండి వచ్చిన లక్షణాలు ఎంత మంది ఇతర వ్యక్తులకు ఉన్నాయి?’’ అని మస్క్ ప్రశ్నించారు.
ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోని వారి విషయానికొస్తే.. నోవాక్ జకోవిచ్ ఇప్పుడే రికార్డు స్థాయిలో గ్రాండ్‌స్లామ్‌లు గెలిచారని మస్క్ చెప్పారు. ‘‘నాకు టీకాలపై నమ్మకం లేనట్లు కాదు.. నేను తీసుకున్నాను. అయినప్పటికీ.. నివారణ వ్యాధి కంటే అధ్వాన్నంగా ఉండకూడు. టీకాల సమర్థతపై బహిరంగ చర్చను మూసివేయకూడదు. సింథటిక్ mRNA ఉపయోగించి అనేక వ్యాధులను నయం చేసే గొప్ప సామర్థ్యం కూడా ఉంది’’ అని ఎలాన్ మస్క్ పోస్టులో పేర్కొన్నారు. ఇక, గతంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్‌లపై మస్క్ ఇదే విధమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.