Suchir Balaji : సుచిర్ బాలాజీ 2024 డిసెంబర్‌లో మృతి చెందారు. అధికారికంగా ఆత్మహత్యగా తేల్చినా, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఎలన్ మస్క్ కూడా అతడి మరణంపై స్పదించారు.
Suchir Balaji : మాజీ ఓపెన్AI పరిశోధకుడు, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ మరణం వివాదాస్పదంగా మారుతోంది. అతడు చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఓపెన్ ఏఐ సీఈవోొ సామ్ ఆల్ట్‌మన్ ఆ విషాదం గురించి బహిరంగంగా మాట్లాడారు. సుచిర్ ది ఆత్మహత్య అని ఆయన అన్నారు.
ఫాక్స్ న్యూస్ హోస్ట్ టక్కర్ కార్ల్‌సన్ బాలాజీ తన ప్రాణం తానే తీసుకున్నాడని అనుకుంటున్నారా? అని నేరుగా అడిగినప్పుడు… ఆల్ట్‌మన్ “నేను నిజంగా అనుకుంటున్నాను” అని బదులిచ్చారు. బాలాజీ చాలా కాలంగా తన సహోద్యోగి అని.. తాను గౌరవించే వ్యక్తి అని అన్నారు. బాలాజీ మరణానికి సంబంధించిన పరిస్థితులను సమీక్షించడానికి తాను చాలా సమయం గడిపానని అన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆల్ట్ మన్ వెల్లడించారు.
అయితే ఆల్ట్‌మన్ వ్యాఖ్యలతో ఎలాన్ మస్క్ తీవ్రంగా విభేదించారు. దీనిపై ఎక్స్ లో స్పందిస్తూ… ఆల్ట్‌మన్ ఆత్మహత్య అంటున్న వీడియోను ప్రస్తావిస్తూ బాలాజీది హత్యగా మస్క్ పేర్కొన్నారు. బాలాజీ విజిల్ బ్లోయింగ్ చుట్టూ ఉన్న వివాదాన్ని, ఓపెన్AIపై ఆయన లేవనెత్తిన ఆరోపణలను మస్క్ హైలైట్ చేశారు. అతని అకాల మరణానికి సంబంధించిన పరిస్థితులపై చర్చను కొనసాగించారు.
26 ఏళ్ల బాలాజీ 2024 డిసెంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కో లోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందారు. శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్, చీఫ్ మెడికల్ ఎగ్జామినర్‌తో సహా అధికారులు ఎలాంటి అనుమానాస్పద చర్యలను గుర్తించలేదు, అధికారికంగా అతని మరణాన్ని ఆత్మహత్యగా తేల్చారు. అయినప్పటికీ, బాలాజీ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది.
ఓపెన్AIని ప్రశ్నించిన సుచిర్ బాలాజీ
బాలాజీ ఓపెన్AIలో దాదాపు నాలుగు సంవత్సరాలు గడిపారు… చాట్‌జీపీటీలో 1.5 సంవత్సరాలు పనిచేశారు. కృత్రిమ మేధస్సుకు ఆయన చేసిన కృషికి విస్తృతంగా గుర్తింపు పొందారు. అయితే చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్AI కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని బాలాజీ బహిరంగంగా ఆరోపించారు, కంపెనీ పద్ధతులు AIకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన ప్రోగ్రామర్లు, జర్నలిస్టులకు హాని కలిగిస్తాయని హెచ్చరించారు.
