Sam Altman:ఓపెన్ ఏఐ సీఈఓగా తిరిగి రాక, డ్రామాకు తెర
ఓపెన్ ఏఐలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న డ్రామాకు తెర పడింది. ఓపెన్ ఏఐ సీఈఓ పదవి నుండి సామ్ ఆల్ట్ మాన్ రెండు రోజుల క్రితం ఉద్వాసనకు గురయ్యాడు. అయితే రెండు రోజుల తర్వాత మరో కీలక నిర్ణయం వెలువడిందని ఆ సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ: సామ్ ఆల్ట్ మన్ ఓపెన్ ఏఐ నుండి ఆకస్మికంగా నిష్క్రమించడం టెక్ ధిగ్గజాల్లో చర్చకు దారితీసింది. ఓపెన్ ఏఐ బోర్డు సమావేశంలో ఆల్ట్ మన్ ను తొలగించారు.ఆల్ట్ మన్ తో పాటు ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్ మన్ కూడ బోర్డు నుండి ఉద్వాసనకు గురయ్యారు. ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
అయితే ఒప్పుడు ఓపెన్ ఏఐ ఆల్ట్ మన్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో రెండు రోజులుగా సాగుతున్న డ్రామాకు తెరపడినట్టుగా కన్పిస్తుంది. అంతేకాదు ఆల్ట్ మన్ తిరిగి కంపెనీకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది.
ఆల్ట్ మన్ తో తాము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని కంపెనీకి సీఈఓగా తిరిగి రావడానికి ఆల్ట్ మన్ సిద్దంగా ఉన్నారని ఓపెన్ ఏఐ ట్వీట్ చేసింది. బ్రెట్ టేలర్ అధ్యక్షతన, లారీ సమ్మర్స్, ఆడమ్ డీ ఏంజెలో తో ముగ్గురు కీలక సభ్యులతో కొత్త బోర్డు కూడ ఏర్పాటు కానుంది ఆ ట్వీట్ తెలిపింది.
బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డీ ఏంజెలోలతో కూడిన కొత్త ప్రారంభ బోర్డుతో సాల్ ఆల్ట్ మన్ ఓపెన్ ఏఐకి సీఈఓగా తిరిగి రావడానికి సూత్రప్రాయంగా ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా ఆ సంస్థ తెలిపింది.
ఈ ట్వీట్ పై గ్రెగ్ బ్రోక్ మాన్ స్పందించారు. గతంలో కంటే బలంగా మరింత ఐక్యంగా తిరిగి వస్తామని బ్రోక్ మన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఇవాళ రాత్రికే ఓపెన్ ఏఐలో కోడింగ్ కు తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు.
ఓపెన్ ఏఐని తాను అమితంగా ప్రేమిస్తున్నట్టుగా ఆల్ట్ మన్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా జట్టును కలిపి ఉంచేందుకు తాను ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆల్ట్ మన్ చెప్పారు. ఆదివారంనాడు తాను మైక్రోసాఫ్ట్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న సమయంలో అదే ఉత్తమ మార్గమమని చెప్పారు. ఆల్ట్ మన్ ఓపెన్ఏఐలో మళ్లీ చేరుతున్నారనే వార్తలపై సత్య నాదెళ్ల స్పందించారు. ఓపెన్ ఏఐలో బోర్డులో చేసిన మార్పులు సమర్ధవంతమైన పాలనకు ముఖ్యమైన దశగా తాము విశ్వసిస్తున్నట్టుగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.