ఎలన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్ర్యం అత్యంత కీలకం అని, ట్విట్టర్ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్నదని భావిస్తున్నారా? అంటూ పోల్ పెట్టారు. అంతేకాద, కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వివరించారు. 

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సొంతంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నారా? అది ఫ్రీ స్పీచ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తుందా? ఓపెన్ సోర్స్ అల్గారిథమ్ బేస్‌తో ఆ సోషల్ మీడియా వేదిక ఉంటుందా? అందులో దుష్ప్రచారానికి తావు ఉండదా? అంటే.. ఎలన్ మస్క్ ఔను అనే రీతిలోనే ట్వీట్ చేశారు. ఈ అంశాలన్నింటిపై తాను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వివరించారు. ఓ ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. అయితే, ఆయన అంతకు ముందే ఓ పోల్ నిర్వహించారు. ఆ తర్వాత ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఆవశ్యకత ఉన్నదా? అంటూ నెటిజన్లను అడిగారు.

ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలని భావిస్తున్నారా? అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఎలన్ మస్క్‌ను అడిగారు. ఓపెన్ సోర్స్ అల్గారిథమ్‌తో ఫ్రీ స్పీచ్‌కు టాప్ ప్రయారిటీ ఇచ్చేలా, విష ప్రచారానికి తావే లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. తాను ఈ విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఎలన్ మస్క్ సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చేశారు. కానీ, అంతకు ముందే అంటే ఈ నెల 25వ తేదీనే ఆయన
ట్విట్టర్‌లో ఒక పోల్ నిర్వహించారు.

Scroll to load tweet…

ఒక ప్రజాస్వామ్యం నిలవడానికి వాక్ స్వాతంత్ర్యం అత్యావశ్యకం అని ఆయన 25వ తేదీన ట్వీట్ చేశారు. మరి ఆ కఠిన నిబంధనలను ట్విట్టర్ అమలు చేస్తున్నదని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై పోల్ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో 70 శాతం మంది అమలు చేయడం లేదని స్పందించారు. ఆ తర్వాత దానికి ఎలన్ మస్క్ మరో ట్వీట్ జత చేశారు. ఈ పోలింగ్ తర్వాతి పరిణామాలు చాలా ప్రధానమైనవని, కాబట్టి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఓటు వేయాలని నెటిజన్లను ఆయన కోరారు.

Scroll to load tweet…

ఈ వారాంతంలో ఆయన మరో ట్వీట్ చేస్తూ.. ట్విట్టర్ ప్రజలకు చాలా చేరువ అయిందని, పబ్లిక్ టౌన్ స్క్వేర్‌గా ఉన్నదని, కానీ, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండే భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నదని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఆయన 26వ తేదీన ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం ఉన్నదా? అని అడిగారు. 

కొత్త ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకున్నట్టయితే.. ఇప్పటికే ఈ రంగంలో అడుగుపెడుతున్న టెక్ కంపెనీల జాబితాలో చేరతారు. అవి కూడా ఫ్రీ స్పీచ్ ప్రధానంగా పుట్టుకొస్తున్నవే కావడం గమనార్హం. అవే కార్యరూపం దాలిస్తే.. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ యూజర్లను లాగేసుకునే అవకాశాలు లేకపోలేదు.