student protest outside parliament:  ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక‌లో నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. పార్లమెంట్ వెలుపల విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళ‌న‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే నిరసనకారులపై శ్రీలంక పోలీసులు టియర్ గ్యాస్‌, జ‌ల ఫిరంగుల‌ను ప్రయోగించారు.  

Sri Lanka Economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభ ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయి. ప్ర‌జా వ్య‌తిరేక‌త క్ర‌మంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు మ‌రింత‌గా ఉధృతం అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్ర‌జ‌ల‌పై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జ‌ల ఫిరంగులను ప్రయోగించారు. ఇంటర్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతృత్వంలోని నిరసనకారులు శాసనసభకు దారితీసే ప్రధాన డ్రైవ్‌లో.. ఇనుప బారికేడ్లను తొల‌గిస్తున్న క్ర‌మంలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. 

దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు దిగింది. అంత‌కు ముందు శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అలాగే, అతని అన్నయ్య, ప్ర‌ధాని మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇదిలావుండ‌గా, 22 మిలియన్ల జనాభా ఉన్నశ్రీలంక లోని ప్రజలు చాలా నెలలుగా బ్లాక్‌అవుట్‌లు మరియు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత దారుణ ప‌ర‌స్థితులు ఇవే. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మ‌రోసారి శ్రీలంక ఎమ‌ర్జెన్సీలోకి వెళ్లింది. భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొన‌సాగుతున్న ప‌రిస్థితుల మధ్య‌.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమ‌ర్జెన్సీ) ప్రకటించారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు పూర్తి అధికారాలు అప్ప‌గించారు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌లు రోజురోజుకు వెల్లువెత్త‌డంతో ఐదు వారాల్లో దేశంలో గోట‌బ‌యా ఎమ‌ర్జెన్సీ విధించ‌డం రెండోసారి. దేశ భ‌ద్ర‌తా ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంత‌కుముందు రాజపక్సే తన వ్యక్తిగత నివాసం వెలుపల భారీ నిరసనల తర్వాత ఏప్రిల్ 1న కూడా అత్యవసర పరిస్థితిని (ఎమ‌ర్జెన్సీ) ప్రకటించారు. ఆ త‌ర్వాత ఎమర్జెన్సీని ఏప్రిల్ 5న ఉపసంహరించుకున్నారు. కాగా, ప్రభుత్వం వద్ద ఇప్పుడు విదేశీ నిధులు కూడా పూర్తిగా అయిపోయాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అధికారిక డేటా $1.7 బిలియన్ల (reserves at $1.7 billion) వద్ద విదేశీ నిల్వలను చూపుతున్నాయి. అయితే ఆ సంఖ్యలో ఎక్కువ భాగం చైనీస్ కరెన్సీ మార్పిడిని కలిగి ఉందని సమాచారం. ఇది ఇతర దేశాల నుండి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించడానికి అవకాశంలేదు. దీంతో దిగమతులపై ప్రభావం పడింది. అందుకే దేశంలో అన్నింటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.