పపువా న్యూగినియాలో భూకంపం:రిక్టర్ స్కేల్ పై 6.9 గా తీవ్రత నమోదు
పపువా న్యూగినియాలో ఇవాళ భూకంపం చోటు చేసుకుంది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఉత్తర పపువా న్యూగినియాలో ఆదివారం నాడు తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకుంది. భూకంపం లోతు 35 కి.మీ.గా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.ప్రాథమిక సమాచారం మేరకు భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9 గా నమోదైందని అధికారులు తెలిపారు.
భూకంపానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.పపువా న్యూగినియాలో భూకంపాలు సర్వసాధరణం. ఇది భూకంపాలు జరిగే ప్రాంతం.ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు.న్యూగినియా లోని వైవాక్ కు నైరుతి దిశలో ఈ భూకంపం చోటు చేసుకుంది. తక్కువ జనాభా ఉన్న ఈ దేశంలో అడవి ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ దేశంలో తొమ్మిది మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ దేశంలోని పలు నగరాలు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే భూకంపాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ లో 7.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.ఈ భూకంపం కారణంగా ఏడుగురు మృతి చెందారు.