Manila: ఫిలిప్పీన్స్ లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరిన్ని భూ ప్రకంపనలతో నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మిండనావో ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ దవావో డీ ఓరోలో మధ్యాహ్నం 2:00 గంటలకు భూకంపం సంభవించింది.
Philippines earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్ లో మంగళవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరిన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశముందని రిపోర్టులు పేర్కొన్నాయి. దీనివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యూఎస్ జియోలాజికల్ సర్వే సైతం సంబంధిత భూకంప గురించి హెచ్చరికలు చేసింది. మిండనావో ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ దవావో డీ ఓరోలోని మారగుసన్ మున్సిపాలిటీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2:00 గంటలకు భూకంపం సంభవించింది. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడిన వార్తలను అధికారులు పరిశీలిస్తున్నారని మరగుసన్ విపత్తు కార్యాలయ ఉద్యోగి ఒకరు తెలిపినట్టు ఏఎఫ్పీ నివేదించింది.
భూ ప్రకంపనల క్రమంలో ఇప్పటివరకైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫిలిప్పీన్స్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. అయితే పట్టణం చుట్టుపక్కల గ్రామాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడ్డాయి.. ఎటువంటి నష్టం జరగలేదని ఓ అధికారి తెలిపారు. కాగా, జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించిన తీవ్రమైన భూకంప-అగ్నిపర్వత కార్యకలాపాలకు ఆలవాలమైన పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు నిత్యం వస్తుంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ప్రకృతి విపత్తులు అధికంగా ఎదుర్కొనే దేశంగా ఫిలిప్పీన్స్ ఉంది.
గత నెల ఫిబ్రవరి 16న సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2:00 గంటల తర్వాత (1800 జీఎంటీ) ఆర్కిపెలాజిక్ దేశం మధ్యలో ఉన్న మాస్బేట్ ద్వీప ప్రావిన్స్ లోతైన భూకంపం సంభవించిందని జియోలాజికల్ సర్వే పేర్కొంది. సమీప గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇదే నెల మొదటి వారంలో కూడా భూకంపం సంభవించింది.
గతేడాది అక్టోబర్ 25న కూడా ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్‌కు ఆగ్నేయంగా ఉన్న పినిలికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించినట్టు అమెరికన్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే రోజు ఉత్తర ఫిల్ప్పీన్స్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం..6.4 తీవ్రతతో భూకంపం లుజోన్ ద్వీపంలోని డోలోరెస్ నుండి 11 కిలోమీటర్లు (7 మైళ్ళు) దూరంలో ఉపరితలానికి 16.2 కిలోమీటర్లు (10 మైళ్ళు) లో భూకంపం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అయితే ఎటువంటి తీవ్రమైన నష్టం జరగలేదు.
అయితే, 1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2,000 మంది మరణించారు. 1976 ఆగస్టు 16న మిండనావోలో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర సెలెబెస్ సముద్రంలో మోరో గల్ఫ్ సరిహద్దులో ఉన్న మిండనావో ద్వీపంలోని 700 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. 5,000 - 8,000 మంది మరణించారని అంచనా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ మంది నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో సునామీ రావడంతో ఈ ఘటనలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.
