ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన న్యూజిలాండ్‌ను ఈరోజు భూకంపం వణికించింది.  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. వెల్లింగ్టన్‌కు సమీపంలోని లోయర్ హాట్‌కు వాయువ్యంగా 78 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 

ఇప్పటికే టర్కీ, సిరియాలను భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడైన భూప్రకంపనలు వస్తే చాలు జనం వణికిపోతున్నారు. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. యూరోపియన్ - మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. వెల్లింగ్టన్‌కు సమీపంలోని లోయర్ హాట్‌కు వాయువ్యంగా 78 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. పట్టణానికి 50 కి.మీల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

టర్కీ, సిరియాలలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇప్పటి వరకు ఇరుదేశాల్లోనూ 41,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన దాదాపు 10 రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో భూకంపం చోటు చేసుకోవడంతో ఆ దేశ వాసులు భయాందోళనలకు గురయ్యారు. 

Also REad: న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటన.. భీకర తుఫాన్ పంజా విసరడంతో ప్రభుత్వ నిర్ణయం

ఇకపోతే.. గాబ్రియెల్ తుఫాన్ కారణంగా న్యూజిలాండ్‌లో ఇప్పటికే భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి గాబ్రియెల్ తుఫాను బలహీనపడి.. న్యూజిలాండ్ తీరానికి దూరంగా జరిగింది. నార్త్ ఐలాండ్ తూర్పు తీరాన్ని దాటడానికి ముందు గాబ్రియెల్ తుఫాను న్యూజిలాండ్‌లో తీవ్రనష్టాన్ని మిగిల్చింది. రోడ్లు, ఇళ్లలోకి భారీగా వరద నీరు ప్రవేశించడంతో లక్షలాది మంది ప్రజలు మేడలు, మిద్దెలు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తినడానికి తిండి లేక పిల్లా పాపలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ఆక్లాండ్ సమీపంలోని బీచ్ కమ్యూనిటీ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో ఆదివారం రాత్రి నుంచి తప్పిపోయిన వాలంటీర్ల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం గాబ్రియెల్ తుఫాన్ న్యూజిలాండ్ తూర్పు దిశలో కేంద్రీకృతమై వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

Scroll to load tweet…