ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రకంపనలు..
Earthquake in Indonesia : ఇండోనేషియాలో మళ్లీ భూకంపం వచ్చింది. అచే ప్రావిన్స్ లో ప్రకంపనలు సంభవించి 24 గంటలు గడవక ముందే జావా సిటీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.0గా నమోదు అయ్యింది.
Indonesia Earthquake : ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. అందరూ సంబరాలు జరపుకుంటున్న సమయంలో ఇండోనేషియాలో భూప్రకంపనలు ఆందోళన రేకెత్తించాయి. ఆ దేశంలో శనివారం కూడా భూకంపం వచ్చింది. 24 గంటలు కూడా పూర్తి కాకముందే జావా సిటీలో ఆదివారం ఈ ప్రకంపనల వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదు అయ్యిందని జీఎఫ్ జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది.
‘‘04 52 జీఎంటీ వద్ద జావాను తాకిన భూకంపం 8.19 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 107.51 డిగ్రీల తూర్పు రేఖాంశంలో కేంద్రీకృతమై ఉంది. దీని లోతు 61.7 కిలో మీటర్లుగా ఉంది’’ అని ‘జిన్హువా’ వార్తా సంస్థ పేర్కొంది. కాగా.. ఇదే దేశంలోని అచే ప్రావిన్స్ లో శనివారం భారీ భూకంపం వచ్చింది. ఈ బలమైన, నిస్సారమైన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదు అయ్యింది. అచే ప్రావిన్స్ లోని తీరప్రాంత పట్టణమైన సినాబాంగ్ కు తూర్పున 362 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా, పసిఫిక్ బేసిన్ లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ఆర్క్ అయిన ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు సంభవిస్తాయి. గతేడాది నవంబర్ 21వ తేదీన పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 331 మంది మృతి చెందగా, దాదాపు 600 మంది గాయపడ్డారు. 2018లో కూడా ఇదే దేశంలో భూకంపం, సునామీ సంభవించడంతో 4,340 మంది ప్రాణాలు కోల్పోయారు.