Asianet News TeluguAsianet News Telugu

ఈ చీకటి.. రాబోయే తరాల వెలుగు కోసం : ఈ రోజు రాత్రి 8.30కి ‘ఎర్త్ అవర్’, అసలేంటీ కార్యక్రమం..?

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8.30కి జరుపుకోనున్నారు. ‘‘లైట్ ఆఫ్ మూవ్‌మెంట్’’గా పిలిచే ఈ ఈవెంట్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది. 

Earth Hour 2023: Lights off at 8.30 pm today Know the reason ksp
Author
First Published Mar 25, 2023, 7:08 PM IST

ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఇళ్లు, కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయనున్నారు. ఈరోజు దాదాపు 190 దేశాల్లోని ప్రజలు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంధన సంరక్షణ, భూతాపం , వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా .. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘‘లైట్ ఆఫ్ మూవ్‌మెంట్’’గా పిలిచే ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తుంది. 

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు గంటపాటు అన్ని లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేయమని ‘ఎర్త్ అవర్’ ప్రజలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వాలు, కంపెనీలు కూడా తమ భవనాలు, స్మారక చిహ్నాలు, ల్యాండ్ మార్క్‌లలో అనవసరమైన లైట్లను ఆఫ్ చేయడం ద్వారా మన గ్రహం మీద శక్తి వినియోగం ప్రభావంపై అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని మొదటిసారి నిర్వహించారు. ఆ రోజున స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు సిడ్నీలో జరిగింది. ఇక్కడ ప్రజలు ఒక గంట పాటు లైట్లు ఆర్పేశారు. 

ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఈ ఈవెంట్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు పాల్గొనడంతో మార్చి 29, 2008న జరుపుకున్నారు. నాటి నుంచి ఎర్త్ అవర్‌కు ప్రజాదరణ పెరుగుతూనే వుంది. ప్రతి యేటా మార్చి చివరి వారంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి దీనిని ఈరోజు జరుపుకుంటున్నారు. సిడ్నీ ఒపెరా హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఈఫిల్ టవర్, కార్నబీ స్ట్రీట్, బకింగ్‌హామ్ ప్యాలెస్, ఎడిన్‌బర్గ్ కోట తదితర చారిత్రక కట్టడాలన్నింటిలో విద్యుత్తును నిలిపివేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios