'ప్రవక్త' వ్యాఖ్యపై నూపుర్ శర్మకు మద్దతునిచ్చిన డచ్ తీవ్రవాద నాయకుడు.. ఎన్నికల్లో విజయం..
ఇస్లాం వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన డచ్ తీవ్రవాద పాపులిస్ట్ గీర్ట్ వైల్డర్స్ అంచనాలను అధిగమించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, వైల్డర్స్ ఫ్రీడమ్ పార్టీ (PVV) 150కి 35 సీట్లు గెలుచుకున్నారు.
ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలతో సస్పెండ్ కు గురైన బిజెపి నాయకురాలు నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చిన డచ్ తీవ్రవాద పాపులిస్ట్ గీర్ట్ వైల్డర్స్ నెదర్లాండ్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇస్లాం వ్యతిరేక వైఖరికి పేరుగాంచిన వైల్డర్స్, నెదర్లాండ్స్‌కు వలసలను ఆపేస్తానని ప్రమాణం చేశాడు. అంచనాలను అధిగమించి, ఆయన ఫ్రీడమ్ పార్టీ 150 సీట్లకు 35 గెలిచిందని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాయిటర్స్ తెలిపింది.
జూలైలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి, ముందస్తు ఎన్నికలకు దారితీసిన క్రమంలో.. అప్పటివరకు ప్రధాన మంత్రిగా ఉన్న మార్క్ రుట్టే పార్టీ 23 స్థానాలతో మూడవ స్థానంలో ఉంది. ఇది అధికారికంగా రుట్టే 13 సంవత్సరాల పాలన ముగింపును సూచిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా రెండు సీట్ల మార్జిన్ లోపంతో నమ్మదగినవిగా ఉంటాయి.
Open AI : మళ్లీ సీఈవోగా తిరిగొచ్చిన సామ్ ఆల్ట్ మన్.. బోర్డు సభ్యులకు ఉద్వాసన...
వైల్డర్స్ గతంలో ఒక టెలివిజన్ షోలో ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శర్మను సమర్థించారు, దీని మీద గల్ఫ్ దేశాల నుండి తీవ్ వ్యతిరేకత ఎదురయ్యింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్‌ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి శర్మ ఆ వ్యాఖ్యలు చేశారు. నిరుడు ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నుపుర్ శర్మ ప్రవక్త వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత్‌ను దూషిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విడుదల చేసిన ప్రకటనను వైల్డర్స్ విమర్శించారు.
"భారతదేశం గురించి లేదా మరేదైనా దేశం గురించి మీరు ఏమనుకుంటున్నారో నిర్ణయించుకునే ముందు అద్దంలో చూసుకోండి. OIC మానవ హక్కుల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దేశాలన్నీ భారతదేశంపై దాడి చేస్తున్నాయి. షరియా చట్టాన్ని ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కంటే ఎక్కువగా చేశారు" అని వైల్డర్స్ ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
ఓఐసీ దేశాలు అత్యంత అసహన దేశాలని, మానవ హక్కులపై చెత్త రికార్డులు ఉన్నాయని ఆయన అన్నారు. "మీరు ఆ దేశాలలో మైనారిటీలైతే హింసించబడతారు. జైలుకు పంపించబడతారు. స్వేచ్ఛను కోల్పోతారు. భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇలాంటి వారు ఇచ్చే ఉపన్యాసాలను అనుమతించకూడదు" అన్నారాయన.
వైల్డర్స్ ఇస్లాం వ్యతిరేక దృక్పథాలు చంపేస్తామనే బెదిరింపులకు దారితీశాయి. దీంతో వైల్డర్స్ గత రెండు సంవత్సరాలుగా భారీ పోలీసు రక్షణలో ఉంటున్నారు. అతను ఇంతకుముందు ప్రవక్త మొహమ్మద్‌ను "పెడోఫిల్" అని, ఇస్లాంను "ఫాసిస్ట్ భావజాలం", "వెనుకబడిన మతం" అని పిలిచాడు. అతను నెదర్లాండ్స్‌లో మసీదులు, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ నిషేధానికి అనుకూలంగా ఉన్నాడు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత విజయ ప్రసంగంలో, వైల్డర్స్ "ఆశ్రయం, వలసల సునామీ"ని అంతం చేస్తానని చెప్పారు.
ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తన పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినట్లు టీవీలో చూసి...వైల్డర్స్ ఆశ్చర్యానందాలతో సంబరాలు చేసుకుంటున్నట్లుగా చూపించింది. "35. FVV, అతిపెద్ద పార్టీ," అతను తన పార్టీని సూచిస్తూ డచ్‌లో పోస్ట్ చేశారు. ప్రచార సమయంలో, వైల్డర్స్ తను సాధారణంగా మాట్లాడే ఇస్లాం వ్యతిరేక మాటలను తగ్గించాడు. డచ్ ప్రజల జీవన వ్యయం, అధిక భారం ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి మాట్లాడాడు.