అమెరికా అధ్యక్ష బరిలోకి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దిగబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. రిపబ్లికన్ నేత ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పై పరాజయం పాలయ్యారు.
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందేహాస్పదుడు, వివాదాస్పదుడు, సంచలనాలకు మారు పేరు. శ్వేత జాతి పక్షం వహించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. విదేశీయుల పట్ల పక్షపాత ధోరణి కలవాడనే అభియోగాలు అప్పట్లో వినిపించాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ఇప్పటికీ ఒటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష బరిలోకి దిగబోతున్నట్టు తాజాగా సంకేతాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మళ్లీ 2024లో జరగనున్నాయి.
ఆయన ఇటీవలే మాట్లాడుతూ, ‘నేను రెండు సార్లు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాను. ఆ రెండు సార్లూ నేనే గెలిచా. మొదటి సారి కంటే రెండోసారే ఇంకా ఎక్కువ ఓట్లు గెలుచుకున్నాను. 2016 కంటే కూడా 2020లోనే ఎక్కువ ఓట్లు గెలుచుకున్నాను. సిట్టింగ్ అధ్యక్షుడిగా అన్ని ఓట్లు ఇది వరకు ఎవరూ గెలచుకోలేదు. మన దేశాన్ని మరింత సక్సెస్‌ఫుల్ చేయడానికి, భద్రత, గౌరవాలను మళ్లీ వెనక్కి తీసుకురావడానికి.. నేను మళ్లీ అదే పని చేయాలని అనుకుంటున్నా’ అని వివరించారు.
కానీ, అంతకంటే ముందు ఈ నవంబర్‌లో రిపబ్లికన్ పార్టీ కోసం ఓ చారిత్రక విజయాన్ని నమోదు చేయవలసి ఉన్నదని అన్నారు. ‘నా తోటి పౌరులారా, మనమంతా కలిసి చేయాల్సిన ఈ అద్భుత ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని తెలిపారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు.. రచయిత్రి కారోల్ క్లెయిమ్..
2020లో ఆయన ఓటమిని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ అంగీకరించలేదు. 2020లో అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ లీడర్ జో బైడెన్ గెలిచిన సంగతి తెలిసిందే.
గతంలోనూ డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా అని ప్రకటించుకున్నారు. కానీ, తాజాగా టెక్సాస్‌లో చేసిన కామెంట్లు మరింత బలంగా కనిపించాయి. వైట్ హౌజ్ కోసం మళ్లీ పోటీ చేస్తానని చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాక డొనాల్డ్ ట్రంప్ సహా ఆయన అభిమానులు ఎవరూ ఆ ప్రజా తీర్పును అంగీకరించలేదు. ఫలితంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించే క్యాపిటల్ హిల్‌లో హింస జరిగింది. క్యాపిటల్ హిల్ పై దాడి అమెరికా చరిత్రలో ఓ హింసాత్మక ఘటనగా నిలిచిపోయింది. ఈ హింస వెనుక డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉన్నదనే ఆరోపణలు అప్పుడు విరివిగా వచ్చాయి. ఆయనే రెచ్చగొట్టే కామెంట్లు చేశారని కొందరు ఆరోపణలు చేశారు. అందుకు ట్విట్టర్‌ను వేదికగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపేయడం గమనార్హం.
Also Read: Donald Trump భారత్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
క్యాపిటల్ హిల్ అల్లర్లలో ఆయన ప్రమేయానికి సంబంధించి హౌజ్ సెలెక్ట్ కమిటీ ఆయనకు ఓ సబ్‌పెనా జారీ చేసింది. శుక్రవారం ఆయన తన ప్రమాణం, డాక్యుమెంట్లు, ఇతరత్రాలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ కమిటీకి సమర్పించాల్సి ఉన్నది. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.
