ఓ మహిళ తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతోందని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. అయితే... అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆమె గొంతు నొప్పిగల కారణాన్ని వైద్యులు చెప్పడంతో ఆమెకు దిమ్మతిరిగినంత పనయ్యింది. అవును.. ఎందుకంటే.. ఆమెకు వచ్చింది సాధారణ గొంతు నొప్పి కాదు. 

ఆమె గొంతులో దాదాపు 1.5మీటర్ల పొడుగు ఉన్న పురుగును వైద్యులు గుర్తించారు. ఈ సంఘటన టోక్యోలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టోక్యోకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇటీవల జపాన్‌ రాజధాని సెయింట్‌ లూకాస్‌ ఇంటర్నేషనల్‌ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసుకుంది. తరచూ గొంతు నొప్పి బాధిస్తుండటంతో.. వైద్యులను సంప్రదించింది. అయితే.. ఆమె గొంతులో ఒకరకమైన పురుగుని వైద్యులు గుర్తించారు.

జపానీస్‌ వంటకం షాషిమి(చేపలు, లేదా ఇతర మాంసాన్ని చిన్న ముక్కులుగా కోసి పచ్చివి తినడం) తిన్న తర్వాత తన గొంతులో నొప్పి మొదలైందని వైద్యులకు తెలిపింది. దీంతో సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 1.5 అంగుళాల పొడవైన, 1 మి.మీ వెడల్పున్న పురుగు ఉన్నట్లు తెలిపారు. 

అనంతరం చికిత్స చేసి దానిని తొలగించగా అది ఇంకా సజీవంగానే ఉండటం గమనార్హం. అదృష్టవశాత్తు పురుగును తొలగించిన తరువాత మహిళా ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. పురుగుకి డీఎన్‌ఏ పరీక్ష చేయగా అది ఎర్రటి వానపాముగా గుర్తించారు. ఇది పచ్చి మాంసం తినేవారికి సోకుతుందని వైద్యులు వెల్లడించారు.