మా విమానాల్లో ఆ కుక్కలను అనుమతించం!

First Published 26, Jun 2018, 11:18 AM IST
Delta Airlines bans pit bulls as service and support animals
Highlights

అమెరికాలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన డెల్టా ఎయిర్‌లైన్స్ ఇకపై తమ విమానాల్లో ఓ జాతి రకం కుక్కలను అనుమతించబోమని ప్రకటించింది. 

అమెరికాలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన డెల్టా ఎయిర్‌లైన్స్ ఇకపై తమ విమానాల్లో ఓ జాతి రకం కుక్కలను అనుమతించబోమని ప్రకటించింది. ఇందుకు ప్రధాన కారణం సదరు జాతి కుక్కలు తమ సిబ్బందని నిత్యం కరుస్తూ ఉండటమేనట. వివరాల్లోకి వెళితే.. చూడటానికే గంభీరంగా కనిపించే 'పిట్ బుల్' జాతికి చెందిన శునకాలను సర్వీస్ ఎనిమల్‌గా కానీ లేదా సపోర్ట్ ఎనిమల్‌గా కానీ తమ విమానాల్లో అనుమతించమని డెల్టా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది చేసిన ఫిర్యాదులు, నమోదైన కేసులను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ కంపెనీ పేర్కొంది. వాస్తవానికి డెల్టా ఎయిర్‌లైన్స్ గడచిన మార్చ్ నెలలో తమ ఎనిమల్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం, ఎవరైనా వ్యక్తులు తమ పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నట్లుయితే, తమ ప్రయాణానికి 24 గంటల ముందే సదరు పెంపుడు జంతువు వ్యాక్సినేషన్ రిపోర్ట్ లేదా హెల్త్ రికార్డ్స్‌ను ఎయిర్‌లైన్ కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది.

కాగా.. తాజాగా ఈ పాలసీలో మార్పులు చేశారు. కొత్త మార్పుల ప్రకారం, పిట్ బుల్ తరహా జాతి కుక్కలను విమానాల్లో నిషేధించనున్నారు. ఇది జులై 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత 2016 నుంచి ఇలాంటి కుక్కల బారిన పడిన వారి సంఖ్య 84 శాతానికి పెరగడంతో సదరు కంపెనీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

loader