ఫుడ్‌ డెలివరీ బాయ్‌లు ఫుడ్ ను మధ్యలో తినేస్తుండడం, కస్టమర్లకు తెలియకుండా ఎంగిలి చేసి డెలివరీ చేస్తుండడం లాంటివి ఇప్పటికే చాలా వీడియోలు వచ్చాయి. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి మరోసారి లండన్ లో వెలుగులోకి వచ్చింది. 

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఒకరు కస్టమర్‌ ఆర్డర్‌ని క్యాన్సిల్‌ చేసి, వారు బుక్‌ చేసుకున్న ఆహారాన్ని తాను తినేశాడు. అది కూడా ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ ఇంటి బయటనే కూర్చుని ఎంచక్కా కానిచ్చేశాడు. ఆ కస్టమర్‌ డెలివరీ బాయ్‌ చేష్టలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరలవుతోంది. 

వివరాల్లోకి వెడితే.. లండన్‌ కెంటిష్‌ టౌన్‌లో ఉండే ఓ మహిళ స్థానిక మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. తన ఆర్డర్ ను ట్రాక్‌ చేస్తుండగా.. ఇంటి దాక వచ్చిన ఆర్డర్‌ సడెన్‌గా క్యాన్సిల్‌ అయ్యింది. తాను చేయకుండా అలా ఎలా ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయ్యిందా అని అనుమానం వచ్చింది. 

దీనికి తోడు  తన ఇంటి బయట మెక్‌డొనాల్డ్స్‌ డెలివరీ బాయ్‌ ఒకరు.. బైక్ పై కూర్చుని ఫుడ్‌ని ఒపెన్‌ చేయడం చూసింది. అనుమానంతో తనకు మెసేజ్ వచ్చిన డెలివరీ బాయ్‌ నంబర్‌కు కాల్‌ చేసింది.  తన ఇంటి బయట ఉన్న వ్యక్తి ఫోన్‌ రింగవ్వటం, అతడు కట్‌ చేయడం ఆమె గమనించింది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్ అక్కడే ఇంటి బయట కూర్చుని ఆమె ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ని లాగించేశాడు‌.

ఈ సంఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోది. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా ఆహారం, సేవలతో కస్టమర్లు మనసు గెలుచుకోవాలనేది మా లక్ష్యం. ఇక ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే.. మాకు తెలియజేయండి. ఇలాంటి వాటిని మేం అస్సలు సహించం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.