అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయాన్ హరికేన్ విధ్వంసం సృష్టించింది. ఇయాన్ హరికేస్ సృష్టించిన విధ్వంసం కారణంగా మరణించినవారి సంఖ్య 40 దాటింది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయాన్ హరికేన్ విధ్వంసం సృష్టించింది. ఇయాన్ హరికేస్ సృష్టించిన విధ్వంసం కారణంగా మరణించినవారి సంఖ్య 40 దాటింది. ఇయాన్ హరికేన్.. యునైటెడ్ స్టేట్స్‌ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో ఒకటిగా నిలిచింది. ఫ్లోరిడాలో పరిస్థితులను సర్వే చేయడానికి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్లనున్నారు. వివరాలు.. ఇయాన్ హరికేన్ బుధవారం ఫ్లోరిడా తీరాన్ని తాకింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్లు, ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి. ఇయాన్‌ను శక్తివంతమైన కేటగిరి 4 హరికేన్‌గా అధికారులు పేర్కొన్నారు.
అత్యంత వేగంగా గాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శార్లెట్ హార్బర్ నుంచి బొనిటా బీచ్ వరకు నైరుతి ఫ్లోరిడాలో ఎనిమిది నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. హరికేన్ తీరం దాటిన తర్వాత కొంత బలహీనపడినప్పటికీ మళ్లీ కెన్నడీ స్పేస్ సెంటర్ వద్ద అట్లాంటిక్ జలాల్లోకి ప్రవేశించడంతో బలం పుంజుకుందని అధికారులు వెల్లడించారు.
తుఫాను సంబంధిత మరణాల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 44కి పెరిగిందని.. ఫ్లోరిడా మెడికల్ ఎగ్జామినర్స్ కమిషన్ శనివారం ఆలస్యంగా తెలిపింది. అయితే కౌంటీ వారీగా అదనపు మరణాల నివేదికలు ఇప్పటికీ కౌంటీలో వెలువడుతున్నాయి. ఇది మొత్తం మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని సూచిస్తుంది. ఏరియల్ వ్యూ ఫొటోలు, వీడియోలు అక్కడ జరిగిన ఇయాన్ హరికేన్ విధ్వంసం ఎంత దారుణంగా ఉందో చూపుతున్నాయి.
శనివారం రాత్రి ఫ్లోరిడాలో 900,000 కంటే ఎక్కువ మంది ప్రజలు విద్యుత్తు లేకుండా ఉండిపోయారు. శనివారం ఉదయం నాటికి ఫ్లోరిడా అంతటా 1,100 మందికి పైగా రక్షించబడ్డారని గవర్నర్ రాన్ డిసాంటిస్ కార్యాలయం తెలిపింది. వందలాది మంది రెస్క్యూ సిబ్బంది తీరప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారని పేర్కొంది. ఇక, చాలా మంది ఫ్లోరిడా ప్రజలు తుఫానుకు ముందుగానే ఇళ్ల నుంచి ఖాళీ చేయబడ్డారు. వారు రక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. నార్త్ కరోలినా, వర్జీనియా అంతటా 45,000 మందికి పైగా ప్రజలు విద్యుత్ లేకుండానే ఉన్నారు.
తీవ్రంగా దెబ్బతిన్న లీ కౌంటీ మాత్రమే 35 మరణాలను నమోదు చేసిందని అధికారిక గణంకాలు సూచిస్తున్నాయి.. ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు తీరప్రాంత రాష్ట్రం నార్త్ కరోలినాలో గవర్నర్ కార్యాలయం అక్కడ ఇయాన్‌కు సంబంధించిన నాలుగు మరణాలను ధ్రువీకరించింది.
ఇయాన్ హరికేన్ ప్రభావంతో దిగ్బ్రాంతికి గురైన ఫ్లోరిడా కమ్యూనిటీలు.. విధ్వంసం వల్ల కలిగిన నష్టం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. మునిగిపోయిన పరిసరాల్లో, రాష్ట్ర నైరుతి తీరం వెంబడి ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ వెతుకుతున్నాయి.
