Covid-19: కరోనా.. మంకీపాక్స్ భయాల మధ్య 16 దేశాల ప్రయాణాలపై సౌదీ అరేబియా ఆంక్షలు !
Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనల మధ్య సౌదీ అరేబియా భారత్ సహా పలు దేశాల ప్రయాణాలపై నిషేధం విధించింది. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మేనియా, బెలారస్, వెనిజులా దేశాలకు పౌరులు తమ ప్రయాణాలు చేయవద్దని ఆదేశించింది.
Covid-19 fourth wave: గత కొంత కాలంగా చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల పుట్టుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, దక్షిణ కొరియా, ఉత్తరకొరియా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల గుర్తించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఇప్పటివరకు వేగంగా వ్యాపించే.. అధిక ప్రభావం కలిగిన వేరియంట్ల కంటే 10 రెట్లు ప్రభావితమైనవిగా ఉంటాయని అంచనాలున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా తమ పౌరుల ప్రయాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్-19 వైరస్ (Covid-19)మళ్లీ పెరుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమ పౌరుల 16 దేశాలకు ప్రయాణాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తోపాటు మొత్తం 16 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సౌదీ అరేబియా పౌరులపై ఆంక్షలు విధించింది. సౌదీ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో భారత్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘానిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులతో పాటు మంకీపాక్స్ (monkeypox) సైతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. చాలా దేశాలకు మంకీపాక్స్ వ్యాపించింది. ప్రస్తుతం 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, సౌదీ అరేబియాలో ఇప్పటివరకు ఒక్క మంకీపాక్స్ (monkeypox) కేసు కూడా నమోదుకాలేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సౌదీ అరేబియా డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్లా అసిరిరి మాట్లాడుతూ.. పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే తమ దేశ పౌరుల ప్రయాణాలపై ఆంక్షలు విధించామని తెలిపింది. అలాగే, దేశంలో ఇప్పటివరకు ఒక్క మంకీపాక్స్ (monkeypox) కేసు కూడా నమోదుకాలేదని పేర్కొన్న ఆయన ప్రజలు భయాందోళనకు గురికావద్దని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కేసులు గుర్తిస్తే.. సమాచారం అందించాలనీ, మంకీపాక్స్ కేసులను పర్యవేక్షించడం.. గుర్తించడం.. ఏదైనా కొత్త కేసు ఉద్భవించినట్లయితే సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం సౌదీ అరేబియాకు ఉందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 527,799,395 కోవిడ్ కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 6,300,433 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలో మొత్తం 763,042 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 9,130 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 85,004,438 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 1,028,924 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానంలో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, టర్కీ, స్పెయిన్ దేశాలు ఉన్నాయి.