Coronavirus: చైనాపై కరోనా పంజా.. కఠిన లాక్‌డౌన్.. దారుణ పరిస్థితుల మధ్య ప్రజాగ్రహం.. !
Covid 4th wave: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో కఠిన ఆంక్షలు విధించారు. అయితే, పరిస్థితులకు అనుగుణంగా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు వంటి నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంచకుండా ప్రజలను లాక్‌డౌన్ లోకి నెట్టడంతో ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. షాంఘై నివాసితులు ఆన్‌లైన్‌లో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం.. అవి ఇప్పటివరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా వ్యాపించే.. ప్రమాదకరమైన వేరియంట్లుగా అంచనాలు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వెలుగుచేసినప్పటి నుంచి చైనాకు ఎదురుకాని పరిస్థితులు అక్కడ ప్రస్తుతం నెలకొనడం రాబోయే కరోనా కొత్త వేవ్ ల ప్రమాదాన్ని సూచిస్తున్నదని నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనాలో గతంలో కంటే ప్రస్తుతం రికార్డు స్థాయలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం చర్యలకు ఉపక్రమించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అయినప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగకపోవడంతో లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది. దేశంలోని అనేక నగరాల్లో కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కొనసాగుతోంది.
అయితే, ప్రస్తుతం చైనా సర్కారు తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను తీవ్రమైన ఇబ్బందులను కలిగించడమే కాకుండా.. వారిని దుర్భర పరిస్థితుల్లోకి జారుస్తున్నది. కరోనా వ్యాప్తి చెందుతున్న ఆయా నగరాల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల ఏర్పడే పరిస్థితులను అంచనావేయడంలో తప్పుచేసిందని తెలుస్తోంది. ఎందుకంటే.. కోవిడ్-19 నేపథ్యంలో కఠినమైన లాక్డౌన్ చర్యలు, సరఫరా గొలుసుల విచ్ఛిన్నం, ఆహార కొరత, నిత్యావసరాలు కూడా అందుబాటులో లేకుండా లాక్‌డౌన్ విధించడం ప్రజలకు శాపంగా మారింది. దీంతో లాక్‌డౌన్ లో ఉన్న ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ప్రజల ఆగ్రహం, నిరసన, అసంతృప్తిని చైనా సర్కారు ఎంతగా అణచివేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దేశ ఆర్థిక కేంద్రమైన షాంఘై నివాసితులు ఆన్‌లైన్‌లో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తాము పడుతున్న ఇబ్బందుల గురించి చెబుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించడానికి షాంఘైలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. లక్షలాది మంది నివాసితులు ఇంట్లో చిక్కుకున్నారు. మరికొందరు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలలో చిక్కుకున్నారు. వారు ఎప్పుడు విడిపించబడతారో ఖచ్చితమైన సమాచారమూ లేదు. చైనీస్ బ్లాగింగ్ సర్వీస్ Weibo మరియు మెసేజింగ్ సర్వీస్ WeChat లో వైరల్ అవుతున్న కోవిడ్ న్యూస్ గమనిస్తే.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చనిపోతున్న వారితో పాటు లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆహార కొతరతలో చిక్కుకుని ఆకలిమంటలతో అలమటిస్తున్న వారు పెరుగుతున్నారు. చైనా అక్కడి పరిస్థితులను పంచుకోకుండా పౌరులపై కఠినమైన సెన్సార్‌షిప్ ను విధించింది. అయినప్పటికీ.. పౌరులు ఇబ్బందులు పెరుగుతుండటంతో ఆన్‌లైన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో షాంఘైలో COVID-19 కేసులు ఆకస్మికంగా పెరిగిన తరువాత, నగర అధికారులు మొత్తం మహానగరాన్ని లాక్‌డౌన్ లోకి తీసుకెళ్లారు. కోవిడ్ వ్యాప్తి తగ్గించడానికి చైనా కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తోంది.