కరోనా మహమ్మారి కారణంగా చాలా దేశాలలో వివాహ వేడుకలకు అనేక నిబంధనలు విధిస్తున్నారు. ముఖ్యంగా అతిధుల సంఖ్య విషయంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అయితే కౌలాలంపూర్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఏకంగా పదివేల మంది అతిథులు హాజరయ్యారు. 

మలేషియాలో కరోనా నిబంధనలు లేవా? అంటే ఉన్నాయి. కరోనా కట్టడి నిబంధనల ప్రకారం పెళ్లిళ్లకు 20 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘించి, ఈ వివాహ వేడుకకు అత్యధిక సంఖ్యలో పదివేల మంది అతిథులు హాజరయ్యారు. 

దీంతో ఈ వివాహం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది. ఇంతకీ ఈ పెళ్లి ఎవరిది అంటే..మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ కుమారుని వివాహం జరిగింది. ఈ పెళ్లికి 10 వేలమంది అతిథులు హాజరయ్యారు. అయితే  వీరెవ్వరూ కరోనా నిబంధనలను ఉల్లంఘించలేదు. 

ఎలాగంటే.. పెళ్లికి వచ్చినవారంతా కార్లలోనే కూర్చుని ఉన్నారు. కిందికి దిగలేదు. కార్లలో కూర్చునే చేతులు ఊపుతూ, కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా టెంగ్కూ అద్నాన్ మాట్లాడుతూ తమ కుమారుని వివాహానికి ఇన్ని వేలమంది రావడం ఆనందంగా ఉందని, వారంతా కార్లలో కూర్చొనే పెళ్లి వేడుక చూశారని తెలిపారు.

అంతేకాదు పెళ్లి భోజనం వారి వారి  కార్ల వద్దకే ప్యాకెట్ల రూపంలో అందజేశామని తెలిపారు. కాగా ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.