పెరల్ హార్బర్, 9/11 కన్నా కరోనా వైరస్ దారుణం: ట్రంప్
కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్ పై జరిగిన దాడికన్నా, 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవంతుల కూల్చివేత కన్నా ఎక్కువని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
ప్రపంచంతో పాటుగా అమెరికాలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అక్కడ కేసుల సంఖ్య పెరగడంతోపాటుగా మరణాల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతుందడం ఆందోళనను కలిగిస్తుంది.
తొలుత కరోనా వైరస్ ను చాలా లైట్ గా తీసుకున్న డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడిప్పుడే దాని పూర్తి వ్యవహారాన్ని అర్థం చేసుకుంటున్నట్టున్నాడు. తాజాగా కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్ పై జరిగిన దాడికన్నా, 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవంతుల కూల్చివేత కన్నా ఎక్కువని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసిన తరువాత అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే! ఇకపోతే సెప్టెంబర్ 2011లో అమెరికా న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలను ఆల్ ఖయిదా నేలమట్టం చేసిన ఘటనలో 3000 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇకపోతే.... కరోనా వైరస్ విషయంలో గతంలో చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. చైనా నుంచి ప్రతినెలా బిలియన్ డాలర్ల దిగుమతి సుంకాన్ని తాను రాబడుతున్నందుకు చైనా తన మీద కక్ష గట్టిందని, తాను రెండవదఫా ఎన్నికల్లోను గెలవడం చైనాకి ఇష్టం లేదని ఆరోపించారు ట్రంప్.
ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రాట్ జో బిడెన్ గెలవాలని చైనా కోరుకుంటుందని, గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన విషయం అందరికి గుర్తుండే ఉంటుందని, ఆకాలంలో అమెరికా నుంచి చైనా చాలా తీసుకుందని ట్రంప్ ఆక్షేపించారు.
ఒకరకంగా ఆ ఎనిమిదేళ్ల కాలంలో చైనా అమెరికా నుంచి ఎంతో సహాయం పొంది తిరిగి ఇచ్చింది మాత్రం శూన్యం అని అన్నాడు ట్రంప్.
తాను వచ్చిన తరువాత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని అమెరికాకు న్యాయంగా రావాల్సిన వాటాను అందించేందుకు కృషి చేసానని అన్నాడు. కానీ ఈ కరోనా వైరస్ కాలంలో అదంతా కనబడకుండా పోయిందని అన్నాడు ట్రంప్.
తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించాలనుకోవడంలేదు కానీ... నిద్రపోయే బిడెన్ ను అధ్యక్షుడిగా చేయాలనీ చైనా భావిస్తోందని ఫైర్ అయ్యాడు ట్రంప్. కరోనా నష్టానికి గాను చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, సేవలపై సుంకాలు విధించనున్నట్టు స్పష్టం, చేసాడు ట్రంప్.
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కనీసం ప్రయత్నించకుండా.... ప్రజల ప్రాణాలకన్నా, రాజకీయ ప్రయోజనాలే ట్రంప్ కి ఎక్కువయిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ సంవత్సరం నవంబర్లో నిర్వహించబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందుతానేమో అనే భయం వల్ల ట్రంప్ ఇలా అస్మాబద్ధంగా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష డెమొక్రాట్లు ఆరోపించారు.