ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు కరోనా కేసులు 35లక్షలకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 35,66,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

వీటిలో నాలుగింట మూడో వంతుల కేసులు యూరప్‌, అమెరికాల్లో నమోదు కావడం అక్కడ కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. కోవిడ్‌-19 బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,48,302 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 11,54,550 మంది కోలుకున్నారు. 

ఐరోపా దేశాల్లో 15 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, లక్షా 43 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇక అమెరికాలో 11 లక్షల మందిపైగా కరోనా బారిన పడగా, 68 వేల మందిపైగా చనిపోయారు. 

ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 3 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక జనసాంద్రత, వాణిజ్య కార్యకలాపాలు, భౌతిక దూరం పాటించడానికి అవకాశం లేని పరిస్థితి ఉండడంతో నగరాల్లో ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 

న్యూయార్క్‌ నగరంలో ఇప్పటివరకు లక్షా 74 వేల మందిపైగా కరోనా బారిన పడ్డారు. స్పెయిన్‌లో మాడ్రిడ్, ఇటలీలో మిలన్, బ్రిటన్‌లో లండన్, ఫ్రాన్స్‌లో పారిస్‌ నగరాల్లో కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.