కరోనా వైరస్ పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. ఇంకా చికిత్సకు సరైన మందు లేక మనుషులు ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. వాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉండడంతో వాటిమీదనే ఇప్పుడు ప్రపంచం ఆశలన్నీ పెట్టుకుంది. 

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ నిన్న మాట్లాడుతూ... ఈ మహమ్మారి అంతమవడానికి రెండేండ్ల కన్నా తక్కువ సమయం పట్టొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేసారు. 1918 ఫ్లూ కన్నా తక్కువ సమయంలోనే ఇది కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్  అన్నారు. 

గ్లోబలైజేషన్ వల్ల ఈ మహమ్మారి 1918 ఫ్లూ కన్నా చాలా తొందరా అన్ని దేశాలకు వ్యాపించిందని, కానీ ప్రస్తుతమున్న శాస్త్రసాంకేతికత వల్ల అప్పటి వైరస్ కన్నా త్వరగానే ఇది అంతమైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

రెండు సంవత్సరాల కన్నా తక్కువ సమయంలోనే ఈ మహమ్మారి అంతమవుతుందని, దీనికోసం ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని ఆయన అన్నారు. సాధారణంగా వైరస్ లు సీజనల్ గా ఉంటాయని, కానీ.. ఈ కరోనా మాత్రం అందుకు భిన్నంగా, సీజన్లతో సంబంధం లేకుండా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. 

ఇకపోతే... నిన్న భారత ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ ఒక తీపికబురు చెప్పారు. ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా, హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ తో కలిసి ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న కావాక్సీన్ అందుబాటులోకి వస్తుందన్నారు. 

ఈ వార్తతో ప్రజల్లో ఈ మహమ్మారిపై త్వరలోనే విజయం సాధించబోతున్నామన్న ఆనందం వ్యక్తమవుతుంది. మరోవైపు ఆక్స్ ఫోర్డ్ టీకా కోవి షీల్డ్ కూడా మూడవ దశ ట్రయల్స్ లో ఉంది. అనుకున్నవి అనుకున్నట్టుగా సాగితే.. ఈ సంవత్సరం ఆఖరకు ఆ వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం కనబడుతుంది. 

జైడుస్‌ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్‌ డీ’ కూడా మంచి పురోగతిని సాధిస్తుందని, ఇది కూడా మరో నాలుగు నెల్లల్లో అందుబాటులోకి వచ్చే ఆస్కారముందని హర్షవర్ధన్ తెలిపారు. వాక్సిన్ తయారీలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.