బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కి ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. కాగా.. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. కాగా... తాను కరోనా నుంచి బయటపడిన తీరును తాజాగా ఆయన వివరించారు.

తనకు లీటర్ల కొద్దీ ఆక్సీజన్ ను ఇచ్చారని.. దాని వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆయన చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానిటర్లలో ఇండికేటర్లు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడం తాను గమనించానని చెప్పారు. అవి చాలా కఠినమైన క్షణాలని, ఆ విషయాన్ని తాను తిరస్కరించబోనని చెప్పారు. ‘‘దీని నుంచి నేను ఎలా బయటపడబోతున్నాను?’’ అని తనను తాను ప్రశ్నించుకున్నట్లు తెలిపారు. 


మార్చి 26న జాన్సన్‌కు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. 10 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేర్పించారు. ఆ మర్నాడే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందించారు. కొద్ది రోజుల్లోనే తన ఆరోగ్యం ఈ స్థాయిలో క్షీణించిపోవడాన్ని నమ్మలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. 

కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 26 నుంచి తిరిగి బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఆయన ఫియాన్సీ కేరీ సైమండ్స్ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రాణాలను కాపాడిన వైద్యుల పేరును ఆ బిడ్డకు పెట్టారు. విల్‌ఫ్రెడ్ లారీ నికొలస్ జాన్సన్ అని పేరు పెట్టారు. డాక్టర్ నిక్ ప్రైస్, డాక్టర్ నిక్ హార్ట్ చాలా శ్రమించి బోరిస్ జాన్సన్ ప్రాణాలు కాపాడారు. వీరి పేర్లలోని నికొలస్‌ను జాన్సన్  తమ బిడ్డకు పెట్టుకున్నారు.