బారన్ ట్రంప్‌కు హార్వర్డ్‌లో సీటు రాకపోవడమే ట్రంప్ తాజా చర్యలకు కారణమన్న వాదనలు వెల్లువెత్తాయి. కానీ హార్వర్డ్, మెలానియా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై తీసుకున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. హార్వర్డ్‌కు ప్రభుత్వం అందించే నిధుల్లో కోత విధించడమే కాకుండా, విదేశీ విద్యార్థులను చేర్చేందుకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేశారు. ఇది ప్రామాణిక నైపుణ్య సంస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపించనుందని పలువురు నిపుణులు అంటున్నారు.

అయితే ఈ చర్యలకు కారణం మరొకటి ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌కి హార్వర్డ్‌ వర్సిటీ సీటు ఇవ్వలేదన్న కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బారన్‌కు హార్వర్డ్‌తో పాటు స్టాన్‌ఫోర్డ్, కొలంబియా యూనివర్సిటీలు కూడా సీటు నిరాకరించడంతో, అతను చివరికి న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నట్టు సమాచారం.

సీటు ఇవ్వకపోవడం..

ఒకవైపు మాజీ అధ్యక్షుడు ఒబామా కుమార్తె మలియాకు హార్వర్డ్‌లో సీటు ఇచ్చినట్లు చెబుతుండగా, ట్రంప్ కుమారుడికి మాత్రం సీటు ఇవ్వకపోవడం అతనికి నచ్చలేదని చెబుతున్నారు. ఇదే కారణంగా హార్వర్డ్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

దరఖాస్తే చేయలేదు..

ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ తాము ఎలాంటి వివక్ష చూపలేదని, బారన్ హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదని స్పష్టం చేసింది. మెలానియా ట్రంప్ కార్యాలయం కూడా దీనిపై స్పందిస్తూ బారన్ ఎప్పుడూ హార్వర్డ్‌లో చేరేందుకు అప్లై చేయలేదని వివరించింది.

ఖర్చు చేయడం లేదు..

ఇక ట్రంప్ తీసుకున్న విదేశీ విద్యార్థుల అనుమతుల రద్దు నిర్ణయంపై హార్వర్డ్ కోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ కోర్టు ఈ అంశంపై విచారణ జరిపి ట్రంప్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రంప్ మాత్రం విదేశీ విద్యార్థులు చదువుకునే సమయంలో వారి దేశాలు ఏ విధంగానూ ఖర్చు చేయడం లేదని ఆరోపించారు.

ఈ వివాదమంతా రాజకీయ విమర్శలకు దారితీయగా, విద్యా రంగంపై ప్రభావం చూపే పరిణామంగా మారుతోంది.