ఉక్రెయిన్ తూర్పు తీర నగరం మరియుపోల్‌పై పట్టు నిలుపుకోవడానికి రష్యాతో వీరోచితంగా పోరాడింది. కానీ, రష్యా దాడికి తట్టుకోలేక చాలా మంది అజవ్‌స్టాల్ స్టీల్ వర్క్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ జవాన్లు తలదాచుకున్నారు. కొన్ని వారాల తర్వాత వారు ఆయుధాలు పక్కనపెట్టి, ఖాళీ చేతులతో రష్యాకు లొంగిపోయారు. రష్యాలోని పలు నాయకులు వారిని చంపేయాలని పేర్కొంటుడటంతో వారి బాగోగులపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఉక్రెయిన్‌కు చెందిన తీర నగరం మరియుపోల్‌లో ఘర్షణలు.. రష్యా దాడికి ప్రతిఘటనగా చూశారు. కొన్ని రోజులపాటు ఉక్రెయిన్ జవాన్లు రష్యా దాడిని తట్టుకుని నిలిచారు. ఆ పోర్టు నగరంలో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్‌లో తలదాచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కూడా మరియుపోల్‌పై దాడిని ప్రత్యేకంగా పర్యవేక్షించాడు. స్టీల్ ప్లాంట్‌లో దాక్కున్న ఉక్రెయిన్ సోల్జర్లను ఎలాగైనా పట్టుకోవాలని ఆయన చెప్పాడు. అందుకోసం స్టీల్ ప్లాంట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, వారిని స్టీల్ ప్లాంట్‌లోనే నిర్బంధిస్తే చాలు అని, అందులో నుంచి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటే చాలని ఆయనే పేర్కొన్నాడు. కొన్ని వారాలపాటు రష్యా సైనికులను ఎదుర్కొన్న తర్వాత ఉక్రెయిన్ జవాన్లు అజోవ్ స్టీల్ ప్లాంట్‌ చివరికి వారికి లొంగిపోక తప్పలేదు. 250 మందికి పైనే ఉక్రెయిన్ జవాన్లు రష్యాకు లొంగిపోయారు. వారిని రష్యా తమ దేశంలోకి బస్సుల్లో తరలించింది. రష్యాకు లొంగిన ఉక్రెయిన్ సైనికుల బాగోగులపై తీవ్ర ఆందోళనలు ఉక్రెయిన్ సహా ఇతర దేశాల్లోనూ వెలువడుతున్నాయి. ఎందుకంటే.. రష్యాకు చెందిన ఓ చట్టసభ్యుడు వారు నరరూప మృగాలని అన్నాడు. వారిని హతమార్చాలని పేర్కొన్నాడు.

కీలక పోర్టు నగరం మరియుపోల్‌‌ కోసం ఉక్రెయిన్ తీవ్రంగా కొట్లాడింది. ఇక్కడ ఉక్రెయిన్ జవాన్లు సరెండర్ కావడంతో రష్యా దీన్ని కీలక విజయంగా ప్రకటించింది. సోమవారం రాత్రి మరియుపోల్ లోని స్టీల్ వర్క్స్ ఫ్యాక్టరీ నుంచి ఉక్రెయిన్ జవాన్లతో బస్సులు రష్యాలోకి బయల్దేరి పోయాయి. ఐదు బస్సులు రష్యా అధీనంలోని నోవోజావ్స్క్‌కు వెళ్లాయి. అక్కడ గాయపడ్డ ఉక్రెయిన్ పౌరులకు చికిత్స అందిస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది.

కాగా, ఏడు బస్సుల్లో ఉక్రెయిన్ ఫైటర్లు రష్యా నియంత్రణలోని దొనెత్స్క్ రీజియన్ సమీపంలోని ఒలెనివ్కాలో కొత్తగా రీఓపెన్ చేసిన జైలుకు తరలించారు. 256 మంది ఉక్రెయిన్ జవాన్లను తమ అధీనంలోకి తీసుకున్నామని రష్యా వెల్లడించింది. వీరంతా తమ ఆయుధాలు వదిలి లొంగిపోయారని తెలిపింది. ఇందులో 51 మంది తీవ్రంగా గాయపడ్డవారు ఉన్నారని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగిపోయినవారి సంఖ్య మరింత ఎక్కువగా చెప్పింది. 264 మంది జవాన్లు రష్యాకు లొంగిపోయారని వివరించింది. 

అయితే, ఈ బంధీలను బదిలీ చేసుకోవడానికి డీల్ కుదుర్చుకోవడంపై ఇరువైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం ఇరినా వెరెష్చుక్ బంధీలను ఇచ్చిపుచ్చుకోవాలని, అందుకోసం ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. కాగా, ఐరాసకు రష్యా డిప్యూటీ అంబాసిడర్ దిమిత్రీ పొల్యాన్స్కీ మాత్రం ఇలాంటి డీల్ ఏమీ కుదరలేదని స్పష్టం చేశారు. మరియుపోల్ నుంచి వారిని ఎలాంటి షరతుల్లేకుండానే తమ అధీనంలోకి తీసుకున్నామని వివరించారు. అయితే, ఈ బంధీల బదిలీలపై స్పష్టత మాత్రం లేదు. కాగా, తాము బంధీలుగా తీసుకున్న ఉక్రెయిన్ జవాన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగునంగా ట్రీట్ చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, రష్యా హై ప్రొఫైల్ చట్టసభ్యులు మాత్రం బంధీలను ఇచ్చిపుచ్చుకునే డీల్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. ఆ దేశ దిగువ సభ స్పీకర్ వ్యాలచెస్లావ్ వొలొడిన్ మాట్లాడుతూ, వారంతా నాజీ క్రిమినల్స్ అని, వారిని ఎక్స్‌చేంజ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌తో చర్చల్లో పాల్గొన్న కీలక నెగోషియేటర్ మాట్లాడుతూ, రష్యాలోకి తరలించిన ఆ ఫైటర్లు మానవ రూపంలో ఉంటున్న జంతువులు అని పేర్కొన్నారు. కాబట్టి, వారికి మరణ శిక్ష విధించాలని తెలిపారు.