ఇండో- చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కుట్రలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. జూన్ నుంచి నేటి వరకు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ఉద్రిక్తతలు పెంచే కార్యక్రమాలు చేపడుతూనే ఉంది.

ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్‌ తమదేనని వాదిస్తున్న చైనా .. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 960 కుటుంబాలను(దాదాపు  3,222 మంది)  వాలంటరీ బేసిస్‌పై ఈ గ్రామాలకు తరలించింది.

భారత్‌, చైనా, భూటాన్ దేశాల జంక్ష‌న్‌లో అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు ప‌శ్చిమాన ఉన్న బ‌మ్ లా పాస్‌కు 5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఈ గ్రామాలను నిర్మించింది. డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాల నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్‌లు తేటతెల్లం చేస్తున్నాయి.

కాగా లద్దాఖ్‌ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనే చైనా ఈ మూడు గ్రామాలను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాల‌తో చైనా తొలి గ్రామాన్ని నిర్మించిన‌ట్లు ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫొటోలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 28 నాటికి ఆ ప‌క్క‌నే మ‌రో రెండు గ్రామాలు వెలిశాయి. అందులో ఒక గ్రామంలో 50 వ‌ర‌కు నిర్మాణాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాలను అధునాత‌న రోడ్ల‌తో అనుసంధానించారు.